Saturday, June 3, 2017

దక్ష యాగము - 52:

4-123-వ.
ఇట్లు వీరభద్రుండు దక్షుని యాగంబు విధ్వంసంబు గావించి నిజ నివాసంబైన కైలసంబునకుఁ జనియె నయ్యవసరంబున.
4-124-చ.
హరభటకోటిచేత నిశి తాసి గదా కరవాల శూల ము
ద్గర ముసలాది సాధనవిదారిత జర్జరితాఖిలాంగులై
సురలు భయాకులాత్ము లగుచున్సరసీరుహజాతుఁ జేరి త
చ్ఛరణ సరోరుహంబులకు సమ్మతిఁ జాఁగిలి మ్రొక్కి నమ్రులై.
4-125-క.
తము ధూర్జటి సైనికు లగు
ప్రమథులు దయమాలి పెలుచ బాధించుట స
ర్వముఁ జెప్పి" రనుచు మైత్రే
య మునీంద్రుఁడు విదురుతోడ ననియెన్; మఱియున్.

టీకా:
ఇట్లు = ఈవిధముగ; వీరభద్రుండు = వీరభద్రుడు; దక్షునిన్ = దక్షుని; యాగంబు = యజ్ఞమును; విధ్వంసంబున్ = నాశనము; కావించి = చేసి; నిజ = తనయొక్క; నివాసంబు = నివాసము; ఐన = అయినట్టి; కైలాసంబున్ = కైలాసమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో. హర = శివుని; భట = భటుల; కోటి = సమూహము; చేతన్ = చేత; నిశిత = వాడియైన; అసి = ఖడ్గములు; గదా = గదలు; కరవాల = పొడవైనకత్తులు; శూల = శూలములు; ముద్గర = ఇనపగుదియలు; ముసల = రోకళ్లు; ఆది = మొదలగు; సాధన = ఆయుధములచే; విదారిత = చీల్చబడిన; జర్జరిత = పెక్కుతూట్లుపరపబడిన; అఖిల = సమస్తమైన; అంగులు = అవయవములు కలవారు; ఐ = అయ్యి; సురలు = దేవతలు; భయ = భయము; ఆకుల = చీకాకుపడిన; ఆత్ములు = మనసులు కలవారు; అగుచున్ = అవుతూ; సరసీరుహజాతున్ = బ్రహ్మదేవుని {సరసీరుహజాతుడు - సరసీరుహము (పద్మము)న జాతుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; చేరి = దగ్గరకువెళ్ళి; తత్ = అతని; చరణ = పాదముల; సరోరుహంబుల్ = పద్మములు {సరోరుహంబులు - సరసున ఈరుహము (పుట్టినది), పద్మము}; కున్ = కు; సమ్మతిన్ = కోరి, మనస్పూర్తిగ; జాగిలి = నేలకువాలి; మ్రొక్కి = నమస్కరించి; నమ్రులు = వనయముతో వంగినవారు; ఐ = అయ్యి. తమున్ = తమను; దూర్జటి = శివుని; సైనికులు = సైనికులు; అగు = అయినట్టి; ప్రమథులు = ప్రమథగణములు; దయమాలి = నిర్దాక్షిణ్యముగ; పెలుచన్ = అతిశయించి; బాధించుట = బాధపెట్టుట; సర్వమున్ = అంతయును; చెప్పిరి = చెప్పారు; అనుచున్ = అంటూ; మైత్రేయ = మైత్రేయుడు అనెడి; ముని = మునులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; విదురు = విదురుని; తోడన్ = తోటి; అనియెన్ = పలికెను; మఱియున్ = ఇంకను.

భావము:
ఈ విధంగా వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి తన నివాసమైన కైలాసానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో... శివభటుల చేతుల్లోని వాడి కత్తులు, గదలు, శూలాలు, ఇనుపగుదియలు, రోకళ్ళు మొదలైన ఆయుధాల దెబ్బలకు అవయవాలన్నీ గాయపడగా దేవతలు భయంతో గుండె చెదరి బ్రహ్మదేవుణ్ణి సమీపించి, అతని పాదపద్మాలకు మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారాలు చేసి, వినయంతో.... శివుని సైనికులైన ప్రమథులు విజృంభించి నిర్దాక్షిణ్యంగా తమను బాధించిన విషయాన్నంతా చెప్పారు” అని మైత్రేయ మునీంద్రుడు విదురునితో చెప్పాడు. ఇంకా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=7&Padyam=124

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: