Friday, June 9, 2017

దక్ష యాగము 56:

4-132-వ.
అని మఱియు నిట్లనియె; "అద్దేవుని డాయం జన వెఱతు మని తలంపకుండు; అతనిఁ జేరు నుపాయం బెఱింగిపుమంటి రేని, నేను నింద్రుండును మునులును మీరలును మఱియు దేహధారు లెవ్వ రేని నమ్మహాత్ముని రూపంబు నతని బలపరాక్రమంబుల కొలఁదియు నెఱుంగజాలము; అతండు స్వతంత్రుండు గావునఁ దదుపాయం బెఱింగింప నెవ్వఁడు సమర్థుం డగు; అయిన నిపుడు భక్తపరాధీనుండును శరణాగత రక్షకుండు నగు నీశునిఁ జేరం బోవుదము;" అని పలికి పద్మసంభవుండు దేవ పితృగణ ప్రజాపతులం గూడి కైలాసాభిముఖుఁ డై చనిచని.
4-133-ఉ.
భాసురలీలఁ గాంచిరి సుపర్వులు భక్తజనైక మానసో
ల్లాసముఁ గిన్నరీజన విలాసము నిత్యవిభూతి మంగళా
వాసము సిద్ధ గుహ్యక నివాసము రాజత భూవికాసి కై
లాసముఁ గాంతి నిర్జిత కులక్షితిభృత్సుమహద్విభాసమున్.

టీకా:
అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈవిధముగ; అనియె = పలికెను; ఆ = ఆ; దేవుని = దేవుని; డాయన్ = దగ్గరకు; చనన్ = వెళ్ళుటకు; వెఱతుము = భయపడుతున్నాము; అని = అని; తలంపకుండు = అనుకొనకండి; అతనిన్ = అతనిని; చేరున్ = చేరెడి; ఉపాయంబున్ = ఉపాయములు; ఎఱిగింపుము = తెలుపుము; అంటిరేని = అంటే; నేనున్ = నేను; ఇంద్రుండును = ఇంద్రుడు; మునులును = మునులు; మీరలును = మీరు; మఱియున్ = ఇంక; దేహధారులు = శరీరముధరించినవారు; ఎవ్వరేని = ఎవరైనాసరే; ఆ = ఆ; మహాత్ముని = గొప్పవాని; రూపంబున్ = స్వరూపము; అతనిన్ = అతని; బల = బలము; పరాక్రమంబుల = పరాక్రమములను; కొలదియున్ = కొంచమైనా, కొలతను; ఎఱుంగన్ = తెలిసికొనుటకు; చాలము = సరిపోము; అతండు = అతడు; స్వతంత్రుండు = స్వతంత్రుడు {స్వతంత్రుడు - తన సంకల్పముగా తను వర్తించువాడు}; కావునన్ = కనుక; తత్ = ఆ; ఉపాయంబున్ = ఉపాయములను; ఎఱింగిపన్ = తెలుపుటకు; ఎవ్వడు = ఎవడు; సమర్థుండు = సామర్థ్యము కలవాడు; అగు = అవును; అయినన్ = అయినప్పటికిని; ఇపుడు = ఇప్పుడు; భక్త = భక్తుల; పరాధీనుండును = ఎడల అధీనుడును; శరణు = శరణమును; ఆగత = వేడువానిని; రక్షకుండున్ = రక్షించువాడును; అగు = అయిన; ఈశునిన్ = శివుని; చేరన్ = దగ్గరకు; పోవుదము = వెళ్ళెదము; అని = అని; పలికి = చెప్పి; పద్మసంభవుండు = బ్రహ్మదేవుడు {పద్మసంభవుడు - పద్మమున సంభవించినవాడు, బ్రహ్మదేవుడు}; దేవ = దేవతలు; పితృగణ = పితృగణములు; ప్రజాపతులన్ = ప్రజాపతులను; కూడి = కలిసి; కైలాస = కైలాసము; అభిముఖుడు = వైపువెళ్ళువాడు; ఐ = అయ్యి; చనిచని = వెళ్ళి. భాసుర = ప్రకాశిస్తున్న; లీలన్ = విధమును; కాంచిరి = చూసిరి; సుపర్వులు = దేవతలు; భక్త = భక్తులైన; జన = జనుల; ఏక = ముఖ్యమైన; మనస్ = మనసునకు; ఉల్లాసము = సంతోషమునుకలిగించునది; కిన్నరీ = కిన్నరీ; జన = స్త్రీల; విలాసము = విలాసముల నివాసము; నిత్య = శాశ్వతమైన; విభూతి = వైభవములకు; మంగళ = శుభములకు; ఆవాసము = నివాసము; సిద్ధ = సిద్ధులకు; గుహ్యక = గుహ్యకులకు; నివాసము = నివాసము; రాజత = వెండివంటికాంతులను; భూ = పుట్టించి; వికాసి = వెలుగొందుచున్నది; కైలాసమున్ = కైలాసమును; కాంతి = కాంతిచేత; నిర్జిత = జయింపబడిన; కులక్షితిభృత్ = కులపర్వతముల యొక్క; సుమహత్ = చాలా గొప్ప; విలాసమున్ = శోభగలది.

భావము:
అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు “మేము ఆయనను సమీపించటానికి భయపడుతున్నాము అని భావించకండి. ఆయన దగ్గరకు పోయే ఉపాయం నన్ను చెప్పమంటారా? నేను, దేవేంద్రుడు, మునులు, మీరు, దేహధారులు ఎవరుకూడా ఆ మహాత్ముని స్వరూపాన్నీ, ఆయన బలపరాక్రమాల పరిమాణాన్నీ తెలుసుకోలేము. ఆయన సర్వస్వతంత్రుడు. కాబట్టి ఆయనను సమీపించే ఉపాయం చెప్పటానికి ఎవ్వరూ సమర్థులు కారు. అయినా ఆయన భక్తులకు అధీనుడు. శరణు జొచ్చిన వారిని రక్షించేవాడు. అందుచేత ఆయన వద్దకు మనం అందరం కలిసి వెళ్ళటం మంచిది” అని చెప్పి బ్రహ్మదేవుడు దేవతలను, పితృదేవతలను, ప్రజాపతులను వెంటబెట్టుకొని కైలాసానికి బయలుదేరి పోయి పోయి...  ఆ విధంగా వెళ్ళిన దేవతలు భక్తుల మనస్సులకు అమితమైన ఆనందాన్ని కలిగించేదీ, కిన్నరస్త్రీలు విలాసంగా విహరించేదీ, శాశ్వతాలైన ఐశ్వర్యాలకూ శుభాలకూ స్థానమైనదీ, సిద్ధులూ యక్షులూ నివసించేదీ, వెండి వెలుగులతో నిండినదీ, తన అనంతకాంతులతో కులపర్వతాల శోభావైభవాన్ని పరాభూతం చేసేదీ అయిన కైలాస పర్వతాన్ని కనులపండువుగా దర్శించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=133

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: