4-155-వ.
అని "దగ్దశీర్షుం డయిన దక్షుం డజముఖుం డగు; భగుండు బర్హి స్సంబంధ భాగంబులు గలిగి మిత్రనామధేయ చక్షుస్సునం బొడగాంచు; పూషుండు పిష్టభుక్కగుచు యజమాన దంతంబులచే భక్షించు; దేవతలు యజ్ఞావశిష్టంబు నాకొసగుటంజేసి సర్వావయవ పూర్ణులై వర్తింతురు; ఖండితాంగులైన ఋత్విగాది జనంబు లశ్వనీదేవతల బాహువులచేతను బూషుని హస్తంబులచేతను లబ్దబాహు హస్తులై జీవింతురు; భృగువు బస్తశ్మశ్రువులు గలిగి వర్తించు;" అని శివుండా నతిచ్చిన సమస్తభూతంబులును సంతుష్టాంతరంగంబులై “తండ్రీ లెస్సయ్యె” నని సాధువాదంబుల నభినందించిరి: అంతనా శంభుని యామంత్రణంబు వడసి సునాసీర ప్రముఖులగు దేవతలు ఋషులతోడం గూడి రా నజుండును రుద్రునిం బురస్కరించుకొని దక్షాధ్వర వాటంబుకుం జనియె; అంత.
4-156-క.
శర్వుని యోగక్రమమున
సర్వావయవములుఁ గలిగి సన్ముని ఋత్వి
గ్గీర్వాణముఖ్య లొప్పిరి
పూర్వతనుశ్రీల నార్యభూషణ! యంతన్.
టీకా:
అని = అని; దగ్ధ = కాలిపోయిన; శీర్షుండు = తల కలవాడు; అయిన = అయిన; దక్షుండు = దక్షుడు; అజ = గొర్రె; ముఖుండు = గొర్రెతల కలవాడు; అగు = అగును; భగుండు = భగుడు; బర్హి = దర్భలకి; సంబంధ = సంబంధించిన; భాగములు = భాగములు; కలిగి = పొంది; మిత్ర = మిత్ర అనెడి; నామధేయ = పేరుగల; చక్షుస్సునన్ = చక్షుస్సులో; పొడగాంచు = పొందును; పూషుండు = పూషుడు; పిష్టభుక్కు = పిండములను తినువాడు; అగుచున్ = అవుతూ; యజమాన = యజమానియొక్క; దంతంబులున్ = దంతములు; చేన్ = చేత; భక్షించు = తినును; దేవతలు = దేవతలు; యజ్ఞ = యజ్ఞము యొక్క; అవశిష్టంబు = మిగిలిన భాగము; నాకున్ = నాకు; ఒసగుటన్ = ఇచ్చుట; చేసి = వలన; సర్వ = సమస్తమైన; అవయవ = అవయవములు; పూర్ణులు = నిండుగ ఉన్నవారు; ఐ = అయ్యి; వర్తింతురు = నడచెదరు; ఖండితాంగులు = విరిగిన అవయవములు కలవారు; ఐన = అయిన; ఋత్విక్ = ఋత్విక్కులు; ఆది = మొదలైన; జనంబులు = వారు; అశ్వనీదేవతల = అశ్వనీదేవతల; బాహువుల = చేతుల; చేతను = చేతను; పూషుని = పూషుని; హస్తంబుల = అరిచేతుల; చేతను = చేతను; లబ్ద = పొందిన; బాహుహస్తులు = బాహుహస్తములు కలవారు; ఐ = అయ్యి; జీవింతురు = జీవించెదరు; భృగువు = భృగువు; బస్త = మేక; శ్మశ్రువులు = మీసములు; కలిగి = పొంది; వర్తించు = నడచును; అని = అని; శివుండు = శివుడు; ఆనతిచ్చిన = అనుగ్రహించగ; సమస్త = సమస్తమైన; భూతంబులును = జీవులును; సంతుష్టాంతరంగులు = సంతుష్టి చెందిన మనసులు కలవారు; ఐ = అయ్యి; తండ్రీ = అయ్యా; లెస్స = సరిగ; అయ్యెన్ = అయినది; అని = అని; సాధువాదంబులన్ = మంచిది మంచిది అనెడి పలుకులతో; అభినందించిరి = అభినందించిరి; అంతన్ = అంతట; ఆ = ఆ; శంభుని = శివుని; ఆమంత్రణంబు = అనుమతి; పడసి = పొంది; సునాసీర = ఇంద్రుడు; ప్రముఖులు = మొదలగు ముఖ్యులు; అగు = అయిన; దేవతలు = దేవతలు; ఋషులన్ = ఋషులను; తోడన్ = తోటి; కూడి = కలిసి; రాన్ = రాగా; అజుండును = బ్రహ్మదేవుడును; రుద్రునిన్ = శివుని; పురస్కరించుకొని = ముందిడుకొని; దక్ష = దక్షుని; అధ్వర = యజ్ఞము యొక్క; వాటంబు = వాటిక; కున్ = కి; చనియె = వెళ్ళెను; అంత = అప్పుడు. శర్వు = శివుని; నియోగ = నియమించిన; క్రమమున = ప్రకారము; సర్వ = సమస్తమైన; అవయవములున్ = అవయవములును; కలిగి = పొంది; సత్ = మంచి; ముని = మునులు; ఋత్విక్ = ఋత్విక్కులు; గీర్వాణ = దేవతల; ముఖ్యులు = ప్రముఖులు; ఒప్పిరి = చక్కగ ఉండిరి; పూర్వ = పూర్వపు; తను = దేహ; శ్రీలన్ = సంపదలతో; ఆర్యభూషణా = గొప్పవారిచే మన్నిపబడేవాడ; అంతన్ = అంతట.
భావము:
అని చెప్పి “శిరస్సు దహింపబడిన దక్షుడు గొర్రెముఖం కలవాడు అవుతాడు. భగుడు దర్భలతో సంబంధించిన యజ్ఞభాగాన్ని పొంది మిత్రనామకమైన నేత్రాలతో చూస్తాడు. పూషుడు పిండి పదార్థాలను యజమాని దంతాల ద్వారా భుజిస్తాడు. దేవతలు యజ్ఞశేషాన్ని నాకు సమర్పించడం వల్ల మునుపటి వలె అన్ని అవయవాలు కలిగి సంచరిస్తారు. అవయవాలు ఖండింపబడిన ఋత్విక్కులు మొదలైనవారు అశ్వినీ దేవతల బాహువుల చేతను, పూషుని హస్తాల చేతను తమ తమ బాహువులను, హస్తాలను పొంది బ్రతుకుతారు. భృగువు చింబోతు మీసాలు, గడ్డాము పొందుతాడు” అని శివుడు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు సమస్త ప్రాణులు సంతోషించి “తండ్రీ! బాగు బాగు” అని మెచ్చుకున్నారు. అప్పుడు ఆ శివుని దగ్గర సెలవు తీసుకొని ఇంద్రుడు మొదలైన దేవతలు ఋషులతో కూడి బయలుదేరారు. బ్రహ్మదేవుడు శివుణ్ణి ముందుంచుకొని దక్షయజ్ఞం జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. అప్పుడు…. శివుని ఆజ్ఞానుసారంగా మునులు, ఋత్విక్కులు, దేవతలు మొదలైన వారంతా తమ తమ పూర్వశరీరాలను పొంది చక్కగా ప్రకాశించారు. అప్పుడు…
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=156
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment