4-130-క.
"క్రతుభాగార్హుం డగు పశు
పతి నీశ్వరు నభవు శర్వు భర్గుని దూరీ
కృత యజ్ఞభాగుఁ జేసిన
యతి దోషులు దుష్టమతులు నగు మీ రింకన్.
4-131-సీ.
పూని యే దేవుని బొమముడి మాత్రన;
లోకపాలకులును లోకములును
నాశ మొందుదు; రట్టి యీశుండు ఘన దురు;
క్త్యస్త్ర నికాయ విద్ధాంతరంగుఁ
డును బ్రియా విరహితుండును నైనవాఁ డమ్మ;
హాత్మునిఁ ద్రిపుర సంహారకరుని
మఖపునస్సంధానమతి నపేక్షించు మీ;
రలు చేరి శుద్ధాంతరంగు లగుచు
4-131.1-తే.
భక్తినిష్ఠలఁ దత్పాద పద్మ యుగళ
ఘన పరిగ్రహ పూర్వంబుగాఁగ నతని
శరణ మొందుఁ డతండు ప్రసన్నుఁ డయినఁ
దివిరి మీ కోర్కి సిద్ధించు దివిజులార!"
టీకా:
క్రతు = యాగములందు; భాగా = భాగమునకు; అర్హుండు = అర్హతకలవాడు; అగు = అయిన; పశుపతిన్ = శివుని {పశుపతి - పాశములచే కట్టబడినవారికి (జీవులకు) పతి, శివుడు}; ఈశ్వరున్ = శివుని {ఈశ్వరుడు - ప్రభువు, శివుడు}; అభవున్ = శివుని {అభవుడు - భవము (పుట్టుక)లేనివాడు, శివుడు}; శర్వున్ = శివుని; భర్గుని = శివుని; దూరీకృత = దూరముచేయబడిన; యజ్ఞ = యజ్ఞమునందలి; భాగున్ = భాగముకలవానిని; చేసిన = చేసినట్టి; అతి = మిక్కిలి; దోషులు = దోషముచేసినవారు; దుష్ట = చెడు; మతులు = బుద్ధులు కలవారు; అగు = అయిన; మీరు = మీరు; ఇంకన్ = ఇంక. పూని = పూనుకొని; ఏ = ఏ; దేవుని = దేవుని యొక్క; బొమముడి = కనుబొమలుముడిపడిన; మాత్రన = మాత్రముచేతనే; లోకపాలకులును = లోకములనుపాలించువారును; లోకములును = భువనములును; నాశనము = నాశనమును; ఒందుదురు = పొందుతారో; అట్టి = అటువంటి; ఈశుండు = శివుడు {ఈశుడు - ప్రభువు, శివుడు}; ఘన = గొప్ప; దురుక్తి = దుష్టపుమాటలు అనెడి; శస్త్ర = శస్త్రముల; నికాయ = సమూహములచేత; విద్ధ = దెబ్బతిన్న; అంతరంగుండును = మనసుకలవానిని; ప్రియా = ప్రియమైనభావన, భార్య; విరహితుండును = లేనివాడును; ఐనవాడు = అయినవాడు; ఆ = ఆ; మహాత్ముని = గొప్పవాని; త్రిపురసంహారకరుని = శివుని {త్రిపురసంహారకరుడు - త్రిపురములను నాశనముచేసినట్టివాడు, శివుడు}; మఖ = యజ్ఞమును; పునః = మరల; సంధాన = ఏర్పరచెడి; మతిన్ = విధమును; అపేక్షించు = కోరు; మీరలు = మీరు; చేరి = కూడి; శుద్ధా = పరిశుద్ధమైన; అంతరంగులు = మనసులు కలవారు; అగుచున్ = అవుతూ.
భక్తి = భక్తి; నిష్ఠలన్ = నిష్ఠలతో; తత్ = అతని; పాద = పాదములు అనెడి; పద్మ = పద్మముల; యుగళ = జంటను; ఘన = గొప్పగా; పరిగ్రహ = పట్టుకొనుటతో; పూర్వకంబు = కూడినది; కాగ = అగునట్లు; అతనిన్ = అతనిని; శరణమున్ = శరణమును; ఒందుడు = పొందండి; అతండు = అతడు; ప్రసన్నుడు = సంతుష్టుడు; అయినన్ = అయినచో; తివిరి = కోరు; మీ = మీ; కోర్కి = కోరిక; సిద్ధించు = సఫలమగును; దివిజులార = దేవతలార.అ
భావము:
యజ్ఞంలో హవిర్భాగం అందుకొనడానికి యోగ్యుడైన పశుపతి, ఈశ్వరుడు, అభవుడు, శర్వుడు, భర్గుడు అయిన పరమేశ్వరుణ్ణి యజ్ఞభాగానికి దూరం చేయడం అనే గొప్ప దోషాన్ని చేసిన దుష్టులు మీరు. ఏ మహాదేవుడు కోపంతో కనుబొమలు ముడివేస్తే లోకాలూ, లోకపాలకులూ నశిస్తారో ఆ మహనీయుని మనస్సు దక్షుని దురుక్తులు అనే బాణాలు గ్రుచ్చుకొని ఇదివరకే నొచ్చింది. ఇప్పుడు ఆ మహాత్మునికి భార్యావియోగం కూడా ప్రాప్తించింది. తిరిగి యజ్ఞాన్ని సక్రమంగా పూర్తి చేయాలనే కోరిక మీకు ఉన్నట్లయితే త్రిపుర సంహారుడైన ఆ హరుని, ఆ మహాదేవుని, ఆ మహానుభావుని నిండుహృదయంతో, నిర్మల భక్తితో ఆశ్రయించండి. ఆయన పాదపద్మాలపై బడి శరణు వేడండి. ఆ దయామయుడు దయ దలిస్తే మీ కోరిక నెరవేరుతుంది. ”
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=131
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment