4-145-తే.
జగములకు నెల్ల యోనిబీజంబు లైన
శక్తి శివకారణుండవై జగతి నిర్వి
కార బ్రహ్మంబ వగు నిన్నుఁ విశ్వ
నాథుఁ గా నెఱిఁగెద నా మనమున నభవ!
4-146-తే.
సమత నది గాక తావకాంశంబు లైన
శక్తి శివరూపములఁ గ్రీడ సలుపు దూర్ణ
నాభి గతి విశ్వ జనన వినాశ వృద్ధి
హేతుభూతుండ వగుచుందు వీశ! రుద్ర!
టీకా:
జగముల్ = లోకముల; కున్ = కి; ఎల్లన్ = అన్నిటికిని; యోని = గర్భము; బీజంబులు = విత్తనములు; ఐన = అయిన; శక్తి = శక్తితత్త్వము; శివ = శివత్త్వములకు; కారణుండవు = ప్రాప్తిస్థానమునవు; ఐ = అయ్యి; జగతిన్ = లోకముల; నిర్వికారబ్రహ్మంబవు = నిర్వికారబ్రహ్మవు; అగు = అయ్యెడి; నిన్నున్ = నిన్ను; విశ్వనాథున్ = విశ్వనాథుని; కాన్ = అగునట్లు; ఎఱిగెదన్ = తెలియుదును; నా = నా యొక్క; మనమునన్ = మనసులో.
సమతన్ = చక్కగా; అది = అంతే; కాక = కాకుండగ; తావక = నీయొక్క; అంశంబులు = అంశలు; ఐన = అయిన; శక్తి = శక్తి; శివ = శివ; రూపములన్ = రూపములతో; క్రీడన్ = ఆటలాగ; సలుపు = చేసెడి; తూర్ణనాభి = సాలీడు; గతిన్ = వలె; విశ్వ = జగము యొక్క; జనన = సృష్టి; వినాశ = లయ; వృద్ధిన్ = పోషణలకు; హేతుభూతుండవు = కారణమాత్రుడవు; అగుచున్ = అవుతూ; ఉందువు = ఉంటావు; ఈశ = శివుడ; రుద్ర = శివుడ.
భావము:
“ఓ పరమేశ్వరా! లోకాల కన్నింటికి ఉత్పత్తిస్థానం అయిన శక్తివి నీవే. జగత్తుల కన్నింటికీ బీజమైన శివుడు నీవే. నీవు నిర్వికార పరబ్రహ్మవు. నిన్ను విశ్వనాథునిగా నా మనస్సులో తెలుసుకున్నాను. ఓ ఈశ్వరా! రుద్రా! నీవు నీ సమాంశాలైన శివ శక్తి స్వరూపాలతో క్రీడిస్తావు. సాలెపురుగు వలె విశ్వసృష్టికీ, వృద్ధికీ వినాశానికీ నీవే హేతువు అవుతుంటావు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=146
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment