Tuesday, June 6, 2017

దక్ష యాగము - 53:

4-126-తే.
ఇంతయును మున్ను మనమున నెఱిఁగి యున్న
కతన విశ్వాత్మకుండును గమలలోచ
నుండు నన నొప్పు నారాయణుండు నజుఁడుఁ
జూడ రారైరి మున్ను దక్షుని మఖంబు.
4-127-వ.
అని చెప్పి సుర లిట్లు విన్నవించినఁ జతుర్ముఖుండు వారల కిట్లనియె.

టీకా:
ఇంతయును = ఇదంతా; మున్ను = ముందే; మనమున్ = మనసులలో; ఎఱిగి = తెలిసి; ఉన్న = ఉన్నట్టి; కతన = కారణముచేత; విశ్వాత్మకుండును = విష్ణువు {విశ్వాత్మకుడు - విశ్వమే తన స్వరూపమైన వాడు, విష్ణువు}; కమలలోచనుండును = విష్ణువు {కమలలోచనుడు - కమలముల వంటి కన్నుల కలవాడు, విష్ణువు}; అనన్ = అనగా; ఒప్పు = ఒప్పెడి; నారాయణుండున్ = విష్ణువు {నారాయణుడు - నారములు (నీరు)యందు ఉండువాడు, విష్ణువు}; అజుడున్ = బ్రహ్మదేవుడు {అజుడు - జన్మములేనివాడు, బ్రహ్మదేవుడు}; చూడన్ = చూడటానికి; రారు = రానివారు; ఐరి = అయిరి; మున్ను = ముందటి; దక్షునిన్ = దక్షుని; మఖంబున్ = యాగమును. అని = అని; చెప్పి = చెప్పి; సురలు = దేవతలు; ఇట్లు = ఈవిధముగ; విన్నవించినన్ = చెప్పుకొనగ; చతుర్ముఖుండు = బ్రహ్మదేవుడు {చతుర్ముఖుడు - నాలుగు ముఖములు కలవాడు, బ్రహ్మదేవుడు}; వారల = వారి; కున్ = కి; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.

భావము:
“ఇదంతా ముందే మనస్సులో తెలుసుకొని ఉండడం చేత విశ్వస్వరూపుడు, కమలాక్షుడు అయిన నారాయణుడు, బ్రహ్మదేవుడు దక్షుని యజ్ఞాన్ని చూడటానికి రాలేదు.” అని చెప్పి మైత్రేయుడు ఇంకా ఇలా అన్నాడు “దేవతలు ఈ విధంగా విన్నవించగా బ్రహ్మ వారితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=126

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: