Saturday, June 10, 2017

దక్ష యాగము - 57:

4-134-సీ.
ధాతు విచిత్రితోదాత్త రత్నప్రభా; 
సంగతోజ్జ్వల తుంగ శృంగములును; 
గిన్నర గంధర్వ కింపురుషాప్సరో; 
జన నికరాకీర్ణ సానువులును; 
మానిత నిఖిల వైమానిక మిథున స; 
ద్విహరణైక శుభ ప్రదేశములును; 
గమనీయ నవమల్లికా సుమనోవల్లి; 
కా మతల్లీ లసత్కందరములు;
4-134.1-తే.
నమర సిద్ధాంగనా శోభితాశ్రమములు; 
విబుధజన యోగ్య సంపన్నివేశములును
గలిగి బహువిధ పుణ్యభోగముల నొప్పు
వినుత సుకృతములకు దండ వెండికొండ.

టీకా:
ధాతు = ధాతువులచే; విచిత్రిత = విచిత్రముగా చిత్రింపబడిన; ఉదాత్త = గొప్ప; రత్న = రత్నముల; ప్రభా = కాంతులతో; సంగత = కూడి; ఉజ్వలత్ = ప్రకాశిస్తున్న; తుంగ = ఎత్తైన; శృంగములును = శిఖరములును; కిన్నర = కిన్నర; గంధర్వ = గంధర్వ; కింపురుష = కింపురుష; అప్సరస = అప్సరస; జన = స్త్రీల; నికర = సమూహములతో; ఆకీర్ణ = నిండియున్నట్టి; సానువులును = చరియలును; మానిత = మన్నింపదగిన; నిఖిల = సమస్తమైన; వైమానిక = విమానములలో తిరుగు; మిథున = జంటల; సత్ = చక్కటి; విహరణ = విహరించుటలుకల; ఏక = కలిసి ఉన్న; శుభ = శోభకల; ప్రదేశములును = ప్రదేశములును; కమనీయ = చూడచక్కని; నవమల్లికా = తాజామల్లె; సుమనస్ = పూల; వల్లిక = తీగలఅల్లికలు; కామతల్ = కాడలతో; లీలన్ = లీలగా; లసత్ = ప్రకాశిస్తున్న; కందరములును = గుహలును; అమరన్ = అమరి యుండగ.
సిద్ధ = సిద్ధుల; అంగనా = స్త్రీలతో; శోభిత = శోభకలిగిన; ఆశ్రమములు = ఆశ్రమములు; విబుధ = దేవతా; జన = జనులకు; యోగ్య = తగిన; సంపత్ = సంపదలతో కూడిన; నివేశములును = గృహములును; కలిగి = కలిగినట్టి; బహువిధ = రకరకముల; పుణ్య = పవిత్ర; భోగములన్ = భోగములతోను; ఒప్పు = ఒప్పెడి; వినుత = ప్రసిద్ధమైన; సుకృతముల = పుణ్యముల; కున్ = కు; దండ = కూర్పులతో దండవంటిది; వెండికొండ = కైలాసపర్వతము.

భావము:
ధాతుద్రవాలతో పలురంగులు కలిగిన రతనాల కాంతులతో ఆ వెండికొండ ఎత్తైన శిఖరాలు ప్రకాశిస్తున్నాయి. ఆ కొండచరియలు కిన్నరులు, గంధర్వులు, కింపురుషులు, అప్సరసలు మున్నగువారితో నిండి ఉన్నాయి. దేవతలు తమ భార్యలతో కూడి విమానాలపై ఆయా ప్రదేశాలలో విహరిస్తున్నారు. గుహలచుట్టూ చిక్కని విరజాజి పూలతీగలు అల్లుకొని ఉన్నాయి. అక్కడి ఆశ్రమాలలో దేవతాస్త్రీలు, సిద్ధస్త్రీలు ఉంటున్నారు. దేవతలు సంచరించటానికి అక్కడి చోట్లన్నీ తగి ఉన్నాయి. చేసిన పుణ్యాలకు పెక్కురకాల భోగాలను అక్కడ అనుభవిస్తున్నారు. ఆ వెండికొండ పుణ్యాల పూలదండగా ఉన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=134

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: