4-137-వ.
ఆ వృక్షమూలతలంబున.
4-138-సీ.
ఇద్ధ సనందాది సిద్ధ సంసేవితు;
శాంతవిగ్రహుని వాత్సల్యగుణునిఁ
గమనీయ లోకమంగళదాయకుని శివు;
విశ్వబంధుని జగద్వినుత యశుని
గుహ్యక సాధ్య రక్షో యక్షనాథ కు;
బేర సేవితుని దుర్వారబలుని
నుదిత విద్యాతపోయోగ యుక్తుని బాల;
చంద్రభూషణుని మునీంద్రనుతునిఁ
4-138.1-తే.
దాపసాభీష్టకరు భస్మదండలింగ
ఘనజటాజిన ధరుని భక్తప్రసన్ను
వితత సంధ్యాభ్రరుచి విడంబిత వినూత్న
రక్తవర్ణు సనాతను బ్రహ్మమయుని.
టీకా:
ఆ = ఆ; వృక్ష = వృక్షముయొక్క; మూల = మొదలు దగ్గరి; తలంబున = ప్రదేశమునందు. ఇద్ధసనందాదిసిద్ధసంసేవితు = శివుని {ఇద్ధసనందాదిసిద్ధసంసేవితు - ఇద్ధ (ప్రసిద్ధులైన) సనంద (సనందుడు) ఆది (మొదలైన) సిద్ధ (సిద్ధులచే) సంసేవితు (చక్కగా సేవించబడుతున్నవాడు), శివుడు}; శాంతవిగ్రహుని = శివుని {శాంతవిగ్రహుని - శాంతమైన స్వరూపము కలవానిని, శివుని}; వాత్సల్యగుణునిఁ = శివుని {వాత్సల్యగుణుడు - వాత్యల్య(సంతానము యెడనుండు స్నేహభావము) పూరితమైన గుణములు కలవాని, శివుని}; కమనీయలోకమంగళదాయకుని = శివుని {కమనీయలోకమంగళదాయకుడు - కమనీయ (మనోహరమైన) లోక (విశ్వజనీన) మంగళ (శుభములను) దాయకుని (ఇచ్చువాని, శివుని}; శివు = శివుని; విశ్వబంధుని = శివుని {విశ్వబంధువు - లోకమునకు మంచి కోరువాడు, శివుడు}; జగద్వినుతయశుని = శివుని {జగద్వినుతయశుడు - విశ్వమున వినుత (ప్రసిద్ధమైన) యశస్సు కలవాడు, శివుడు}; గుహ్యకసాధ్యరక్షోయక్షనాథకుబేరసేవితుని = శివుని {గుహ్యకసాధ్యరక్షోయక్షనాథకుబేరసేవితుడు -గుహ్యకసాధ్యరక్షోయక్షలకునాయకుడైన కుబేరునిచే సేవింపబడువాడు, శివుడు}; దుర్వారబలుని = శివుని {దుర్వారబలుడు - వారింపశక్యముకాని బలము కలవాడు, శివుడు}; ఉదితవిద్యాతపోయోగయుక్తుని = శివుని {ఉదితవిద్యాతపోయోగయుక్తుడు - ఉద్భవించిన విద్యలు తపస్సు యోగములుతో కూడినవాడు, శివుడు}; బాలచంద్రభూషణుని = శివుని {బాలచంద్రభూషణుడు - బాలచంద్రుడు (చంద్రవంక) భూషణముగ కలవాడు, శివుడు}; మునీంద్రనుతుని = శివుని {మునీంద్రనుతుడు - మునులలోశ్రేష్ఠులచే నుతింపబడువాడు, శివుడు}; తాపసాభీష్టకరున్ = శివుని {తాపసాభీష్టకరు - తాపసుల అభీష్టము (కోరికలు) కరుడు (తీర్చువాడు), శివుడు};
భస్మదండలింగఘనజటాజినధరుని = శివుని {భస్మదండలింగఘనజటాజినధరుడు - భస్మము (విభూతి) దండము లింగము ఘన (గొప్ప)జటలు అజిన(లేడిచర్మము) ధరించినవాడు, శివుడు}; భక్తప్రసన్ను = శివుని {భక్తప్రసన్నుడు - భక్తుల యెడ ప్రసన్నముగ యుండువాడు, శివుడు}; వితతసంధ్యాభ్రరుచివిడంబితవినూత్నరక్తవర్ణు = శివుని {వితతసంధ్యాభ్రరుచివిడంబితవినూత్నరక్తవర్ణుడు - వితత (విస్తారమైన) సంధ్యాకాల అభ్ర (మేఘము) ని పోలిన వినూత్న (ప్రశస్తమైన) రక్త(ఎర్రని) వర్ణుడు (రంగువాడు), శివుడు}; సనాతను = శివుని {సనాతనుడు - శాశ్వతుడు, శివుని}; బ్రహ్మమయుని = శివుని {బ్రహ్మమయుడు - బ్రహ్మ స్వరూపుడు, శివుని}.
భావము:
ఆ మర్రిచెట్టు క్రింద... ప్రసిద్ధులైన సనందుడు మొదలైన సిద్ధులచేత సేవింపబడేవాడు, శాంతమూర్తి, దయాగుణం కలవాడు, లోకాలకు శుభాలను కలిగించేవాడు, శివుడు, విశ్వానికి బంధువైనవాడు, లోకాలు పొగడే కీర్తి కలవాడు, గుహ్యకులూ సాధ్యులూ రాక్షసులూ యక్షులకు రాజైన కుబేరుడూ మున్నగువారిచే సేవింపబడేవాడు, ఎదురులేని బలం కలవాడు, విద్యతో తపస్సుతో యోగంతో కూడినవాడు, నెలవంకను అలంకరించుకున్నవాడు, మునీంద్రులచేత స్తుతింపబడేవాడు, తాపసుల కోరికలను తీర్చేవాడు, విభూతినీ దండాన్నీ జడలనూ గజచర్మాన్నీ ధరించినవాడు, భక్తులను అనుగ్రహించేవాడు, సంధ్యాకాలంలోని మేఘాల కాంతిని పోలిన క్రొత్త ఎర్రని కాంతులతో వెలిగేవాడు, శాశ్వతుడు, బ్రహ్మస్వరూపుడు అయిన శివుణ్ణి చూశారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=138
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment