Monday, June 12, 2017

దక్ష యాగము - 59:

4-136-సీ.
ఉజ్జ్వలంబయి శతయోజనంబుల పొడ; 
వొగిఁ బంచసప్తతి యోజనముల
పఱపును గల్గి యే పట్టునఁ దఱుగని; 
నీడ శోభిల్ల నిర్ణీత మగుచుఁ
బర్ణశాఖా సమాకీర్ణమై మాణిక్య; 
ములఁ బోలఁగల ఫలములఁ దనర్చి
కమనీయ సిద్ధయోగక్రియామయ మయి; 
యనఘ ముముక్షు జనాశ్రయంబు
4-136.1-తే.
భూరిసంసార తాప నివారకంబు
నగుచుఁ దరురాజ మనఁగఁ బెంపగ్గలించి
భక్తజనులకు నిచ్చలుఁ బ్రమద మెసఁగ
వలయు సంపద లందు నావటము వటము.

టీకా:
ఉజ్జ్వలంబు = ప్రకాశిస్తున్నది; అయి = అయ్యి; శత = వంద (100); యోజనంబుల = యోజనముల; పొడవు = పొడవు; ఒగిన్ = వరుసగా; పంచసప్తతి = డెబ్బై ఐదు (75); యోజనంబుల = యోజనముల; పఱపును = వెడల్పును; కల్గి = కలిగి ఉండి; ఏపట్టున = ఎక్కడైన; తఱుగని = తగ్గని; నీడ = నీడ; శోభిల్లన్ = శోభిల్లుట; నిర్ణీతము = నిశ్చయము; అగుచున్ = అవుతూ; పర్ణ = ఆకులతోను; శాఖా = కొమ్మలతోను; సమ = చక్కగా; ఆకీర్ణము = వ్యాపించినది; అగున్ = అవుతూ; మాణిక్యములన్ = మాణిక్యములను; పోలన్ = పోల్చుటకు; కల = తగిన; ఫలములన్ = పండ్లతో; తనర్చి = అతిశయించి; కమనీయ = మనోహరమైన; సిద్ధ = సిద్ధుల; యోగ = యోగమునకు చెందిన; క్రియా = క్రియలతో; మయ = కూడినట్టిది; అయి = అయిన; అనఘ = పుణ్యులైన; ముముక్షు = మోక్షముకోరెడి; జన = వారికి; ఆశ్రయంబును = ఆస్థానమైనదియును. 
భూరి = అత్యధికమైన; సంసార = సంసారమునకు చెందిన; తాప = బాధలను; నివారకంబును = పోగొట్టునది; అగుచున్ = అవుతూ; తరు = వృక్షములలో; రాజము = శ్రేష్టమైనది, పెద్దది; అనగన్ = అనగా; పెంపగ్గలించి = అతిశయించి; భక్త = భక్తులైనట్టి; జనుల్ = వారి; కున్ = కి; నిచ్చలున్ = నిత్యము; ప్రమదము = సంతోషము; ఎసగ = అతిశయించుటకు; వలయు = కావలసిన; సంపదలన్ = సంపదలను; అందు = కలిగి ఉండుటలో, అందించుటకు; ఆవటము = నివాసము; వటము = మఱ్ఱిచెట్టు.

భావము:
వందయోజనాల పొడవు, డెబ్బైయైదు యోజనాల వెడల్పు కలిగిన ఒక మర్రిచెట్టును దేవతలు చూచారు. ఆ చెట్టు నీడ సందులేకుండా అంతటా నిండి ఉంది. ఆ చెట్టు ఆకులతో, కొమ్మలతో అలరారుతూ మాణిక్యాలకు సాటివచ్చే పండ్లతో నిండి ఉన్నది. అది సిద్ధయోగ క్రియలకు ఆలవాలమై దోషరహితమై మోక్షం కోరేవారికి ఆశ్రయమై అలరారుతున్నది. అది సంసారతాపాన్ని తొలగిస్తుంది. ఆ మేటిమ్రాను భక్తులకు ఆనందం కలిగించే ఐశ్వర్యాలకు పుట్టినిల్లు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=136

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: