Sunday, January 29, 2017

కాళియమర్దనము - తొఱ్ఱులఁ

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:
10.1-633-వ.
అనిన “న య్యగాధజలంబుల వలన మాధవుం డెట్టి నేర్పున సర్పంబు దర్పంబు మాపి వెడలించె, నందుఁ బెద్దకాలం బా వ్యాళం బేల యుండె? నెఱిగింపుము.
10.1-634-క.
తొఱ్ఱులఁ గాచిన నందుని
కుఱ్ఱని చరితామృతంబు గొనకొని చెవులన్
జుఱ్ఱంగఁ దనివి గల్గునె;
వెఱ్ఱుల కైనను దలంపవిప్రవరేణ్యా! "
టీకా:
అనినన్ = అనగా; ఆ = ఆ; అగాధ = మిక్కిలి లోతుగల; జలంబుల = నీటి; వలన = నుండి; మాధవుండు = కృష్ణుడు; ఎట్టి = ఎటువంటి; నేర్పునన్ = నేర్పుచేత; సర్పంబు = ఆ పాము యొక్క; దర్పంబున్ = మదమును; మాపి = పోగొట్టి; వెడలించెన్ = వెడలగొట్టెను; అందున్ = ఆనదియందు; పెద్దకాలంబు = చాలాకాలమునుండి; వ్యాళంబు = పాము; ఏల = ఎందుచేత; ఉండెన్ = ఉన్నది; ఎఱిగింపుము = తెలియ చెప్పుము.
తొఱ్ఱులన్ = ఆవులను; కాచిన = మేపెడి; నందుని = నందుని యొక్క; కుఱ్ఱని = కుమారుని; చరిత = చరిత్ర అనెడి; అమృతంబున్ = అమృతమును; కొనకొని = పూని; చెవులన్ = చెవులతో; జుఱ్ఱంగన్ = ఆసక్తితో పీల్చుకొనగా; తనివి = తృప్తి; కల్గునె = కలుగునా, కలుగదు; వెఱ్ఱుల్ = పిచ్చివాని; కిన్ = కి; ఐనను = అయినప్పటికి; తలంపన్ = తరచి చూసినచో; విప్ర = బ్రాహ్మణ; వరేణ్యా = శ్రేష్ఠుడా.
భావము:
అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు “ఆ అతి లోతైన మడుగులోని నాగరాజు కాళియుడి గర్వం లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు ఎలా అణచాడో. ఎలా వెళ్ళ గొట్టాడో? ఆ నేర్పు ఎలాంటిదో? అసలు అన్నాళ్ళు ఆ కాళిందిలో ఆ సర్పరాజు ఎందుకున్నాడో. నాకు చెప్పు.
ఓ బ్రహ్మణోత్తమా! శుకబ్రహ్మ! గోవులను కాచిన నందుని కుమారుని కథలనే సుధారసాన్ని చెవులారా జుర్రుకుంటు ఆస్వాదిస్తున్న ఎంతటి వెర్రివాడైనా తృప్తిచెంది ఇంక చాలు అనుకోగలడా? ఊహు అనుకోలేడు."

No comments: