8-632-సీ.
యోగమార్గంబున నూహించి బహువిధ;
పుష్పదామంబులఁ బూజ చేసి
దివ్యగంధంబులుఁ దెచ్చి సమర్పించి;
ధూపదీపములఁ దోడ్తోడ నిచ్చి
భూరి లాజాక్షతంబులు జల్లి ఫలములుఁ;
గానిక లిచ్చి రాగములఁ బొగడి
శంఖాదిరవములు జయఘోషములుఁ జేసి;
కరుణాంబునిధి! త్రివిక్రమ! యటంచు
8-632.1-ఆ.
బ్రహ్మ మొదలు లోకపాలురుఁ గొనియాడి;
రెల్ల దిశల వనచరేశ్వరుండు
జాంబవంతుఁ డరిగి చాటె భేరిధ్వని
వెలయఁ జేసి విష్ణు విజయ మనుచు.
టీకా:
యోగమార్గంబునన్ = దివ్యదృష్టితో; ఊహించి = ఊహించి; బహు = అనేకమైన; విధ = రకములైన; పుష్పదామంబులన్ = పూలమాలలతో; పూజచేసి = పూజించి; దివ్య = మేలైన; గంధంబులున్ = సుగంధద్రవ్యములను; తెచ్చి = తీసుకొచ్చి; సమర్పించి = సమర్పించి; ధూపదీపములన్ = ధూపదీపములను; తోడ్తోడన్ = వెంటవెంటనే; ఇచ్చి = ఇచ్చి; భూరి = అధికముగా; లాజ = పేలాలు; అక్షతలున్ = అక్షింతలు; చల్లి = వేసి; ఫలములన్ = పండ్లు; కానికలు = కానుకలు; ఇచ్చి = సమర్పించి; రాగములన్ = రాగయుక్తముగా; పొగడి = కీర్తించి; శంఖ = శంఖములు; ఆది = మున్నగు; రవములు = శబ్దములు; జయ = జయజయయనెడి; ఘోషములున్ = నాదములు; చేసి = చేసి; కరుణాంబునిధి = దయాసాగరుడా; త్రివిక్రమ = త్రివిక్రముడా; అట = అని; అంచున్ = అనుచు. బ్రహ్మ = బ్రహ్మదేవుడు; మొదలు = మొదలగు; లోకపాలురు = లోకపాలకులు; కొనియాడిరి = కీర్తించిరి; ఎల్లన్ = అన్ని; దిశలన్ = వైపులను; వనచర = భల్లూకము; ఈశ్వరుండు = రాజు; జాంబవంతుడు = జాంబవంతుడు; అరిగి = వెళ్ళి; చాటె = చాటింపువేసెను; భేరి = బాజాల; ధ్వని = చప్పుడు; వెలయన్ = ప్రసిద్ధముగ; చేసి = చేసి; విష్ణు = విష్ణుమూర్తి; విజయము = జయము జయము; అనుచు = అనుచు.
భావము:
యోగమార్గంలో ఊహించి లోకాలను పాలించే బ్రహ్మదేవుడు మున్నగువారు మహావిష్ణువును అనేక రకాలైన పూలమాలలతో పూజలు చేసారు; మేలైన సుగంధ ద్రవ్యాలను, ధూపదీపాలనూ సమర్పించారు; అనంతమైన పేలాలనూ అక్షతలనూ చల్లారు; ఫలాలూ కానుకలూ పెట్టారు; సంతోషంతో కీర్తించారు; శంఖాలు మున్నగువాటిని ఊదారు; జయజయ నాదాలు చేసారు; కరుణాసముద్రా! త్రివిక్రమదేవా! అని కొనియాడారు; భల్లూకరాజైన జాంబవంతుడు అన్ని దిక్కులమ్మటా ఢంకా మ్రోగిస్తూ విష్ణుదేవుని విజయాన్ని చాటాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=632
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment