Monday, January 2, 2017

వామన వైభవం - 73:

8-591-క.
ఉడుగని క్రతువులఁ వ్రతములఁ
బొడగనఁ జన నట్టి పొడవు పొడవునఁ గుఱుచై
యడిగెడినఁట; ననుబోఁటికి
నిడరాదె మహానుభావ! యిష్టార్థంబుల్.
8-592-శా.
ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనవుపై, నంసోత్తరీయంబుపై,
బాదాబ్జంబులపైఁ, గపోలతటిపై, బాలిండ్లపై నూత్నమ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?

టీకా:
ఉడుగని = ఎడతెగని; క్రతువులన్ = యాగములతో; వ్రతములన్ = వ్రతములతో; పొడగనన్ = దర్శించుటకు; చననట్టి = వీలుకానట్టి; పొడవు = గొప్పవాడు; పొడవున = ఔన్నత్యముతో, కొలతలో; కుఱుచ = తక్కువ, పొట్టి; ఐ = అయ్యి; అడిగెడిన్ = అడుగుతున్నాడు; అట = అట; నను = నా; పోటి = వంటివాని; కిన్ = కి; ఇడన్ = దానమిచ్చుట; రాదె = చేయకూడదా ఏమి; మహానుభావ = గొప్పవాడా; ఇష్ట = కోరిన; అర్థంబుల్ = సంపదలను. ఆదిన్ = ముందుగా; శ్రీసతి = లక్ష్మీదేవి; కొప్పు = జుట్టుముడి; పైనన్ = మీద; అంసోత్తరీయంబు = పైట; పైన్ = మీద; పాద = పాదములుయనెడి; అబ్జంబుల = పద్మముల; పైన్ = మీద; కపోలతటి = చెక్కిళ్ళ; పైన్ = మీద; పాలిండ్ల = స్తనముల; పైన్ = మీద; నూత్న = సరకొత్త; మర్యాదన్ = గౌరవమును; చెందు = పొందెడి; కరంబు = చేయి; క్రింద = కింద ఉన్నది; అగుట = అగుట; మీద = పైన ఉన్నది; ఐ = అయ్యి; నా = నా యొక్క; కరంబున్ = చేయి; ఉంటన్ = ఉండుట; మేల్ = గొప్ప; కాదే = కాదా ఏమిటి; రాజ్యమున్ = రాజ్యము; గీజ్యమున్ = గీజ్యము; సతతమే = శాశ్వతమా కాదు; కాయంబు = దేహము; నాపాయమే = చెడిపోనిదా కాదు.

భావము:
ఓ మహత్మా! శుక్రాచార్యా! ఎడతెగని యజ్ఞ యాగాలు, వ్రతాలూ చేసినా, పుణ్యకార్యాలు చేసినా విష్ణువును దర్శించడానికి వీలు పడదు. అటువంటి గొప్ప వాడు కురచ అయి అడుగుతున్నాడు. అతడు కోరినదానిని ఇవ్వడం కంటే నావంటి వాడికి ఇంకేం కావాలి. ఇతడు దానం కావాలని చాచినచేయి ఎంతో గొప్పది కదా! మొదట లక్ష్మీదేవి యొక్క కొప్పు ముడి మీద, శరీరం మీద, పైట చెంగు మీద, పాదపద్మాల మీద, చెక్కిళ్ళ మీద, పాలిండ్ల మీద సరికొత్త మర్యాదలు పొందే దివ్యమైన హస్తం. అంతటి చెయ్యి కిందది కావటం నాచెయ్యి పైది కావటం ఎంత అదృష్టం! ఎంత మేలు! దీని ముందు ఈ రాజ్యం ఏ పాటిది! ఇదేమైనా శాశ్వతంగా ఉండేదా! ఈ శరీరం ఏమైనా పడిపోకుండా ఉండిపోతుందా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=76&Padyam=592

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

1 comment:

Unknown said...

అద్భుతం