Sunday, January 1, 2017

వామన వైభవం - 72:

8-589-క.
ధాత్రిని హలికునకును సు
క్షేత్రము బీజములు నొకటఁ జేకుఱు భంగిం
జిత్రముగ దాత కీవియుఁ
బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే?
8-590-శా.
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? 
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!

టీకా:
ధాత్రిన్ = భూమిపైన; హలికున్ = రైతున; కునున్ = కు; క్షేత్రము = మంచిపొలము; బీజములు = మంచివిత్తనములు; ఒకటన్ = ఒకేచోట; చేకూరు = సమకూరెడి; భంగిన్ = వలె; చిత్రముగ = అపురూపముగ; దాత = దానముచేయువాని; కి = కి; ఈవియున్ = దానమునకు తగినది; పాత్రము = తగినగ్రహీత; సమకూరున్ = కలిసివచ్చు; అట్టి = అటువంటి; భాగ్యము = అదృష్టము; కలదే = ఉందా, లేదు. కారే = కలుగరా; రాజులు = రాజులు; రాజ్యముల్ = రాజ్యములు; కలుగవే = పొందలేదా ఏమి; గర్వ = అహంకారముతో; ఉన్నతిన్ = విర్రవీగుటను; పొందరే = చెందలేదా ఏమి; వారు = వాళ్ళందరు; ఏరి = ఎక్కడ ఉన్నారు; సిరిని = సంపదలను; మూటగట్టుకొని = కూడగొట్టుకొని; పోవంజాలిరే = తీసుకెళ్ళగలిగిరా, లేదు; భూమి = నేలపైన; పేరైనన్ = కనీసము పేరైన; కలదే = ఉన్నదా, లేదు; శిబి = శిబిచక్రవర్తి; ప్రముఖులున్ = మొదలగువారు; ప్రీతిన్ = కోరి; యశః = కీర్తి; కాములు = కోరువారు; ఐ = అయ్యి; ఈరే = ఇవ్వలేదా; కోర్కులు = దానములను; వారలన్ = వారిని; మఱచిరే = మరచిపోయారా, లేదు; ఈ = ఇప్పటి; కాలమున్ = కాలమునందును; భార్గవా = శుక్రాచార్యుడా {భార్గవుడు - భృగువు పుత్రుడు, శుక్రుడు}.


భావము:
దున్నే రైతుకు మంచి పొలమూ, మంచి విత్తనాలూ ఒక చోట దొరకడం అరుదు. అదే విధంగా దాతకు తగిన ధనమూ, దానిని తీసుకునే ఉత్తముడూ దొరికే అదృష్టం అపురూపం కదా. భర్గుని కమారుడైన శుక్రాచార్యా! పూర్వం కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో విర్రవీగినవారే కదా. కాని వారెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : : 

No comments: