Monday, January 23, 2017

వామన వైభవం - 94:



8-630-మ.
తన పుట్టిల్లిదె పొమ్మటంచు నజుఁడుం దన్నాభిపంకేరుహం
బు నిరీక్షించి నటించి యున్నత పదంబుం జూచి తత్పాదసే
చనముం జేసెఁ గమండలూదకములం జల్లించి; తత్తోయముల్
వినువీథిం బ్రవహించె దేవనదినా విశ్వాత్ముకీర్తిప్రభన్.
8-631-వ.
తత్సమయంబున.

టీకా:
తన = తన యొక్క; పుట్టిల్లు = జన్మస్థానము; ఇదె = ఇదె; పొమ్ము = సుమా; అంచున్ = అనుచు; అజుడు = బ్రహ్మదేవుడు; తత్ = అతని; నాభి = బొడ్డు; పంకేరుహంబున్ = తమ్మిని; నిరీక్షించి = చూసి; నటించి = మిక్కలి సంతోషించి; ఉన్నత = ఉన్నతమైన; పదంబున్ = పాదములను; చూచి = చూసి; తత్ = అతని; పాద = పాదములను; సేచనమున్ = తడపుట; చేసెన్ = చేసెను; కమండలు = కమండలములోని; ఉదకములన్ = నీటిని; చల్లించి = చల్లి; తత్ = ఆ; తోయముల్ = నీరు; వినువీథిన్ = ఆకాశమునందు; ప్రవహించెన్ = పారినవి; దేవనదిన్ = ఆకాశగంగ; నా = అనబడుతు; విశ్వాత్మున్ = విష్ణుమూర్తి; కీర్తి = యశస్సు యనెడి; ప్రభన్ = కాంతులై. తత్ = ఆ; సమయంబునన్ = సమయమునందు.

భావము:
మహవిష్ణువు బొడ్డు తామరను చూసి “నా జన్మస్థానం ఇదే సుమా!” అనుకుంటూ అజుడు అయిన బ్రహ్మదేవుడు సంతోషించాడు. మహొన్నతమైన ఆ పాదాన్ని దర్శించుకున్నాడు. తన కమండల జలంతో స్వామి పాదాన్ని కడిగాడు. ఆ జలధారలు కీర్తికాంతితో నిండి ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఇంకా ఆ సమయంలో . . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=630

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: