Thursday, January 5, 2017

వామన వైభవం - 75:



8-595-క.
మేరువు దల క్రిం దైనను
బారావారంబు లింకఁ బాఱిన లోలో
ధారుణి రజమై పోయినఁ
దారాధ్వము బద్ధమైనఁ దప్పక యిత్తున్.
8-596-మత్త.
ఎన్నడుం బరువేఁడఁ బోఁడట; యేకలుం డఁట; కన్న వా
రన్నదమ్ములు నైన లేరఁట; యన్నివిద్యల మూల గో
ష్ఠిన్నెఱింగిన ప్రోడ గుజ్జఁట; చేతు లొగ్గి వసింప నీ
చిన్ని పాపనిఁ ద్రోసిపుచ్చఁగ జిత్త మొల్లదు సత్తమా! "

టీకా:
మేరువు = మేరుపర్వతము; తలక్రింద = తలకిందులు; ఐనన్ = అయిపోయినసరే; పారావారంబులు = సముద్రములు; ఇంకబాఱినన్ = ఇంకిపోయినసరే; లోలోన్ = లోపలలోపలే; ధారుణి = భూమండలము; రజము = పొడి; ఐపోయినన్ = అయిపోయినసరే; తారాధ్వము = ఆకాశము {తారాధ్వము - తార (నక్షత్రపు) అధ్వము (దారి), ఆకాశము}; బద్ధమైనన్ = బద్దలైపోయినసరే; తప్పక = తప్పకుండ; ఇత్తున్ = ఇచ్చెదను.
         ఎన్నడున్ = ఎప్పుడు; పరున్ = ఇతరులను; వేడన్ = అడుగుటకు; పోడు = వెళ్ళడు; అటన్ = అట; ఏకలుండు = ఒంటరి, అసహాయుడు; అట = అట; కన్నవారు = తల్లిదండ్రులు; అన్నదమ్ములు = సోదరులు; ఐనన్ = అయినను; లేరు = లేరు; అటన్ = అట; అన్ని = సర్వ; విద్యలన్ = విద్యలయొక్క; మూలగోష్ఠి = ముఖ్యసారాంశమును; ఎఱింగిన = తెలిసిన; ప్రోడగుజ్జు = బహునేర్పరి; అటన్ = అట; చేతులు = చేతులు; ఒగ్గి = చాచి; వసింపన్ = ఉండగా; ఈ = ఈ; చిన్నిపాపనిన్ = పసివానిని; త్రోసిపుచ్చగన్ = గెంటివేయుటకు; చిత్తము = మనసు; ఒల్లదు = ఒప్పుటలేదు; సత్తమా = సమర్థుడా.

భావము:
మేరుపర్వతం తిరగబడితే బడవచ్చు, సప్తసముద్రాలు ఇంకిపోతే పోవచ్చు, ఈ భూమండలం అంతా తనలో తనే పొడిపొడి అయితే కావచ్చు, ఆకాశం బద్దలు అయితే కావచ్చు. కాని నేను మాత్రం ఇస్తానన్న దానం తప్పకుండా ఇస్తాను. మహానుభావా! ఈ పొట్టి పిల్లాడు ఎప్పుడు ఇతరులను అడగటం అన్నది లేదుట. ఒంటరి యట. కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు లేరుట. అన్ని విద్యల మూల సారం తెలిసిన నేర్పరి యట. నా ముండదు చేతులు చాపి ఇలా నిల్చున్న ఇలాంటి పసివాడిని గెంటేయటానికి నాకు మన సొప్పటం లేదు."

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=77&Padyam=595

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

1 comment:

Unknown said...

" నా ముండదు " ని "నా ముందర" గా సవరింపగలరు.