Monday, January 9, 2017

వామన వైభవం - 80:

8-605-క.
సురలోక సముద్ధరణము
నిరతశ్రీకరణ మఖిల నిగమాంతాలం
కరణము భవసంహరణము
హరిచరణము నీఁటఁ గడిగె నసురోత్తముడున్.
8-606-వ.
ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునం జల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణ నంబు చేసి.

టీకా:
సురలోక = దేవతలు అందరను; సముద్ధరణమున్ = చక్కగా కాపాడెడిది; నిరత = కలకాలము; శ్రీకరణ = మేలుకలిగించెడిది; అఖిల = సర్వ; నిగమాంత = వేదాంతములకు; అలంకరణమున్ = అలంకారమైనది; భవ = పునర్జన్మప్రాప్తి; హరణమున్ = పోగొట్టునది; హరి = విష్ణునియొక్క; చరణమున్ = పాదమును; నీటన్ = నీటితో; కడిగెన్ = శుభ్రపరచెను; అసుర = రాక్షసులలో; ఉత్తముడున్ = శ్రేష్ఠుడు. ఇట్లు = ఈ విధముగ; ధరణీసుర = బ్రాహ్మణుని {ధరణీసురుడు - భూమిపైదేవత, విప్రుడు}; దక్షిణ = కుడి; చరణ = పాదమును; ప్రక్షాళనము = కడుగుట; చేసి = చేసి; వామ = ఎడమ; పాదంబున్ = పాదమును; కడిగి = కడిగి; తత్ = ఆ; పావన = పవిత్రమైన; జలంబున్ = నీటిని; శిరంబునన్ = తలపైన; చల్లుకొని = ప్రోక్షించుకొని; వార్చి = ఆచమనముచేసి; దేశ = ప్రదేశము; కాల = కాలము; ఆది = మున్నగువాని; పరిగణన = ఎంచిపలికుట; చేసి = చేసి.

భావము:
దేవతలను కష్టాలనుండి కాపాడేది. కలకాలమూ మేలుకలిగించేవి. సమస్త ఉపనిషత్తులకూ అలంకారం అయినవి. భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చేవి వామనుడైన విష్ణువు కుడిపాదాలు. అటువంటి ఆయన కుడి పాదాన్ని బలిచక్రవర్తి నీటితో కడిగాడు. అదే విధంగా ఆ చక్రవర్తి వామనుని ఎడమ పాదాన్నికూడా కడిగాడు. పవిత్రమైన ఆ జలాలను నెత్తి మీద చల్లుకున్నాడు. ఆచమనం చేశాడు. దేశమూ కాలమూ మొదలైన వాటిని లెక్కించి. . .
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=605

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: