Tuesday, January 10, 2017

వామన వైభవం - 81:

8-607-శా.
"విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే
దప్రామాణ్యవిదే త్రిపాద ధరణిం దాస్యామి!" యంచుం గ్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జే సాఁచి పూజించి "బ్ర
హ్మప్రీత"మ్మని ధారపోసె భువనం బాశ్చర్యముం బొందగన్.
8-608-వ.
తత్కాలంబున.

టీకా:
విప్రాయ = బ్రాహ్మణుడవు; ప్రకట = ప్రసిద్దమైన; వ్రతాయ = నిష్ఠ కలవాడవు; భవతే = నీకు; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; స్వరూపాయ = స్వరూపము ఐనవాడవు; వేద = వేదములందలి; ప్రామాణ్య = ప్రమాణములను; విదే = తెలిసివాడవు; త్రి = మూడు (3); పాద = అడుగుల; ధరణిన్ = భూమిని; దాస్యామి = దానము చేయుచుంటిని; అంచున్ = అనుచు; క్రియాక్షిప్రుండు = పనియందు త్వరకలవాడు; ఐ = అయ్యి; దనుజేశ్వరుండు = రాక్షసరాజు; వడుగున్ = బ్రహ్మచారిని; చేన్ = చేయి; చాచి = చాచి; పూజించి = పూజచేసి; బ్రహ్మ = పరబ్రహ్మకి; ప్రీతమ్ము = ప్రీతికలుగగాక; అని = అని; ధారపోసె = ధారపోసెను {ధారపోయు - దానముచేసెడి క్రియలో నీటిధారను దాత చేతినుండు గ్రహీత చేతిలో పడునట్లు పోసెడి విధి}; భువనంబు = జగత్తంతా; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యము; పొందగన్ = పడునట్లుగా..... తత్ = ఆ; కాలంబునన్ = సమయమునందు.

భావము:
బలిచక్రవర్తి చేతులు సాచి వామడిని పూజించాడు. “బ్రాహ్మణుడవూ; ప్రసిద్ధమైన వ్రతం కలవాడవు; విష్ణు స్వరూపుడవూ; వేదాల నియమాలు తెలిసినవాడవూ; అయిన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నాను.” అని పలికి “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక. ” అంటూ వెనువెంటనే ధారపోసాడు. అదిచూసి విశ్వం అంతా ఆశ్చర్యపోయింది. ఆ సమయంలో. . . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=607

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: