Saturday, January 14, 2017

వామన వైభవం - 85:



8-615-క.
"క్షితి దానమిచ్చు నతఁడును
నతికాంక్షఁ బరిగ్రహించు నతఁడును దురిత
చ్యుతులై శతవత్సరములు
శతమఖ లోకమునఁ గ్రీడ సలుపుదు రెలమిన్.
8-616-వ.
అట్లుగావున నే దానంబును భూదానంబునకు సదృశంబు గానేరదు; గావున వసుంధరా దానం బిచ్చితి; వుభయలోకంబులం గీర్తి సుకృతం బులు పడయు" మని పలికి య మ్మాయావటుం డిట్లనియె.

టీకా:
క్షితిదానము = భూదానమును; ఇచ్చు = ఇచ్చెడి; అతడున్ = వాడు; అతి = మిక్కిలి; కాంక్షన్ = కోరికతో; పరిగ్రహించు = తీసుకొనెడి; అతడున్ = వాడు; దురిత = పాపములు; చ్యుతులు = నశించినవి; ఐ = అయ్యి; శత = నూరు (100); వత్సరములు = సంవత్సరములు; శతమఖ = ఇంద్రుని; లోకమునన్ = లోకమునందు; క్రీడన్ = విహరించుట; సలుపుదురు = చేసెదరు; ఎలమిన్ = సంతోషముతో. అట్లుగావున = అందుచేత; ఏ = ఎట్టి; దానంబును = దానముకూడ; భూదానంబున్ = భూదానమున; కున్ = కు; సదృశంబున్ = సమానమైనది; కానేరదు = కాలేదు; కావున = అందుచేత; వసుంధరాదానంబు = భూదానము; ఇచ్చితివి = ఇచ్చినావు; ఉభయ = ఇహపరరెండు; లోకంబులన్ = లోకములలోను; కీర్తి = యశము; సుకృతంబులు = పుణ్యములు; పడయుము = పొందుదువుగాక; అని = అని; పలికి = చెప్పి; ఆ = ఆ; మాయా = కపట; వటుండు = బ్రహ్మచారి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
అంతట మాయాబ్రహ్మచారి బలిచక్రవర్తి తో ఇలాఅన్నాడు. “భూమిని దానం ఇచ్చిన వాడికి; దానిని ప్రీతితో తీసుకున్న వాడికి పాపాలు నశించిపోతాయి. వారు సంతోషంగా నూరు యాగాలు చేస్తే దక్కే స్వర్గలోకంలో నూరేండ్లు విహరిస్తారు. అందుచేత, ఏదానమూ భూదానానికి సమానంకాదు. భూదానం ఇచ్చిన నీకు ఇహ పర లోకాలు రెంటిలోనూ కీర్తీ, పుణ్యమూ కలుగుతుంది.” అని పలికి మాయాబ్రహ్మచారి మళ్లీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=615

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: