Friday, January 13, 2017

వామన వైభవం - 84:

8-613-ఆ.
కమలనాభు నెఱిఁగి కాలంబు దేశంబు
నెఱిఁగి శుక్రు మాట లెఱిగి నాశ
మెఱిఁగి పాత్ర మనుచు నిచ్చె దానము బలి
మహి వదాన్యుఁ డొరుఁడు మఱియుఁ గలఁడె.
8-614-క.
బలి చేసిన దానమునకు
నళినాక్షుఁడు నిఖిలభూత నాయకుఁ డగుటం
గలకల మని దశదిక్కులు
బళిబళి యని పొగడె భూతపంచక మనఘా!

టీకా:
కమలనాభున్ = విష్ణుడని; ఎఱిగి = తెలిసి; కాలంబు = కాలప్రభావము; దేశంబు = ప్రదేశప్రభావములను; ఎఱిగి = తెలిసి; శుక్రు = శుక్రుని; మాటలు = మాటలను; ఎఱిగి = తెలిసి; నాశమున్ = కలిగెడిచేటు; ఎఱిగి = తెలిసి; పాత్రము = యోగ్యమైనది; అనుచున్ = అనుచు; ఇచ్చెన్ = ఇచ్చెను; దానమున్ = దానమును; బలి = బలి; మహిన్ = భూమిమీద; వదాన్యుడు = దాత; ఒరుడు = ఇంకొకడు; మఱియున్ = మఱి; కలడె = ఉండగలడా, లేడు. బలి = బలి; చేసిన = చేసినట్టి; దానమున్ = దానమున; కున్ = కు; నళినాక్షుండు = విష్ణువు; నిఖిల = సమస్తమైన; భూత = జీవుల; నాయకుడు = ప్రభువు; అగుటన్ = అగుటవలన; కలకలము = కలకల; అని = అని; దశ = పది; దిక్కులు = దిశలందు {దశదిక్కులు - 4దిక్కులు 4మూలలు పైన కింద మొత్తం 10వైపులు}; భళిభళి = ఓహో ఓహో; అని = అని; పొగడె = శ్లాఘించెను; భూతపంచకము = పంచభూతములును {పంచభూతములు - 1పృథివి 2అప్పు 3తేజస్సు 4వాయువు 5ఆకాశము}; అనఘా = పుణ్యుడా.

భావము:
బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తెలుసుకున్నాడు. దేశకాలాలు తెలుసుకున్నాడు. శుక్రుని మాటలు అర్థం చేసుకున్నాడు. తనకు చేటువాటిల్లుతుందని తెలుసుకున్నాడు. అయినప్పటికి యోగ్యమైనదిగా భావించి ఆ దాన మిచ్చాడు. లోకంలో అటువంటి మహాదాత మరొకడుంటాడా? ఓ పరీక్షన్మహారాజా! సర్వ భూతాలకూ విష్ణువు అధిపతి కదా. కనుక, ఆయనకు బలిచక్రవర్తి దానం చేయగానే దిక్కులు అన్నీ కళకళలాడాయి. పంచభూతాలూ “భళి భళి” అని పొగిడాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=614

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: