Friday, January 20, 2017

వామన వైభవం - 91:

8-625-మ.
ఒక పాదంబున భూమి గప్పి దివి వే ఱొంటన్ నిరోధించి యొం
డొకటన్ మీఁది జగంబు లెల్లఁ దొడి, నొండొంటిన్ విలంఘించి. ప
ట్టక బ్రహ్మాండకటాహముం బెటిలి వేండ్రంబై పరుల్ గానరా
కొకఁడై వాగ్దృగలభ్యుఁడై హరి విభుం డొప్పారె విశ్వాకృతిన్.
8-626-ఆ.
ఒక పదంబు క్రింద నుర్వి పద్మము నంటి
కొన్న పంకలవము కొమరుఁ దాల్చె;
నొకటి మీఁదఁ దమ్మి కొదిఁగిన తేఁటినా
వెలసె మిన్ను నృప! త్రివిక్రమమున.

టీకా:
ఒక = ఒక; పాదంబులన్ = పాదముతో; భూమిన్ = భూమిని; కప్పి = కప్పివేసి; దివిన్ = స్వర్గమును; వేఱొంటన్ = ఇంకొకదానితో; నిరోధించి = ఆపి; ఒండొకటన్ = ఇంకొకదానితో; మీది = పైనున్న; జగంబులన్ = లోకములను; ఎల్లన్ = అన్నిటిని; తొడిన్ = క్రమముగా; ఒండొంటిన్ = ఒక్కొదానిని; విలంఘించి = దాటిపోయి; పట్టక = పట్టకపోవుటచేత; బ్రహ్మాండ = బ్రహ్మాండము యొక్క; కటాహంబు = పైపెంకు; పెటిలి = బద్దలై; వేండ్రంబు = మిక్కిలి తీక్షణమైనదై; పరుల్ = ఇతరులు; కానరాక = కనబడకుండగ; ఒకడు = ఏకలుడు; ఐ = అయ్యి; వాక్ = మాటలకు; దృక్ = చూపులకు; అలభ్యుడు = అందనివాడు; ఐ = అయ్యి; హరి = విష్ణుడు; విభుండు = విష్ణుడు; ఒప్పారెన్ = ప్రసిద్దముగనుండెను; విశ్వాకృతిన్ = విశ్వరూపమునందు.
              ఒక = ఒక; పదంబు = పాదము; క్రిందన్ = కింద; ఉర్వి = భూమండలము; పద్మమున్ = పద్మమునకు; అంటికొన్న = అంటుకొన్నట్టి; పంక = బురద; లవము = రేణువువలె; కొమరు = మనోజ్ఞతను; తాల్చెన్ = ధరించెను; ఒకటి = ఇంకొకదాని; మీదన్ = మీద; తమ్మి = పద్మమున; ఒదిగిన = వంగియున్న; తేటిన్ = తుమ్మద; నా = వలె; వెలసె = ప్రకాశించెను; మిన్ను = ఆకాశము; నృపా = రాజా; త్రివిక్రమమున = విశ్వాకారమునందు.

భావము:
విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు ఒకఅడుగులో భూలోకాన్ని, ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్ని, మరియొక అడుగుతో పైలోకాలనూ కప్పివేసాడు. క్రమంగా అన్నింటినీ దాటిపోయాడు. ఆ మహారూపం పట్టకపోవడంవలన బ్రహ్మాండభాండం పెటపెటలాడి బ్రద్దలైపోసాగింది. ఆయన తప్ప ఇంకెవరూ కనేవించకుండా పోయారు. ఆ విశ్వరూపుడు మాటలకు చూపులకు అందరానివాడై సంశోభించాడు.రాజా! విశ్వరూపంతో ఒకపాదం క్రింద ఉన్న భూమండలం పద్మానికి అంటుకున్న చిన్న బురద ముద్ద వలె ఒప్పింది. ఇంకొక పాదం మీద ఉన్నఆకాశం పద్మం మీద వ్రాలిన తుమ్మెదవలె ప్రకాశించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=626

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: