8-641-సీ.
దానవ! త్రిపదభూతల మిత్తు నంటివి;
ధరణిఁ జంద్రార్కు లెందాఁక నుందు
రంత భూమియు నొక్క యడుగయ్యె నాకును;
స్వర్లోకమును నొక్క చరణమయ్యె;
నీ సొమ్ము సకలంబు నేఁడు రెండడుగులు;
గడమ పాదమునకుఁ గలదె భూమి?
యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు;
నిరయంబు బొందుట నిజముగాదె?
8-641.1-తే.
కాన దుర్గతికినిఁ గొంత కాల మరుగు
కాక యిచ్చెదవేని వేగంబ నాకు
నిపుడ మూఁడవ పదమున కిమ్ముఁ జూపు
బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమె?
టీకా:
దానవ = రాక్షసుడా; త్రిపద = మూడడుగుల; భూతలమున్ = భూభాగమును; ఇత్తున్ = ఇచ్చెదను; అంటివి = అన్నావు; ధరణిన్ = భూమిని; చంద్ర = చంద్రుడు; అర్కులు = సూర్యుడు; ఎందాక = ఎక్కడిదాక; ఉందురు = కనబడెదరో; అంత = అక్కడివరకు; భూమియున్ = భూమిని; ఒక్క = ఒకేఒక; అడుగు = అడుగు; అయ్యెన్ = అయినది; నా = నా; కునున్ = కు; స్వర్లోకమును = స్వర్గలోకము; ఒక్క = ఒకేఒక; చరణము = అడుగు; అయ్యెన్ = అయినది; నీ = నీ యొక్క; సొమ్ము = సంపద; సకలంబు = అంతా; రెండు = రెండు (2); అడుగులు = అడుగులు; కడమ = మిగిలిన; పాదమున్ = అడుగున; కున్ = కు; కలదె = ఉన్నదా; భూమి = నేల; ఇచ్చెదన్ = దానమిచ్చెదను; అన్న = అనిన; అర్థమున్ = సొమ్ము; ఈని = ఇయ్యనట్టి; దురాత్ముండు = దుష్టుడు; నిరయంబున్ = నరకమును; పొందుట = పొందుట; నిజము = సత్యము; కాదె = కాదా ఏమి. కాన = కనుక; దుర్గతి = నరకమునకుపోవుట; కినిన్ = కి; కొంత = కొంత; కాలము = సమయము; అరుగున్ = పట్టును; కాక = అలాకాకుండగ; ఇచ్చెదవు = ఇచ్చెడివాడవు; ఏని = ఐతే; వేగంబ = శ్రీఘ్రమే; నా = నా; కున్ = కు; ఇపుడ = ఇప్పుడే; మూడవ = మూడవ (3); పదమున్ = అడుగున; కున్ = కు; ఇమ్ము = చోటు; చూపు = చూపుము; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; అధీనములున్ = ఆధీనముకావలసినవానిని; త్రోవన్ = కాదనుటకు; బ్రహ్మ = బ్రహ్మదేవునకైన; వశమె = సాధ్యమా, కాదు.
భావము:
“ఓ దనుజేంద్రా! బలీ! మూడడుగుల నేల ఇస్తాను అన్నావు కదా. భూలోకమూ, సూర్య చంద్రుల దాకా ఉండే స్థలము నాకు ఒక అడుగుకి సరిపోయింది. స్వర్గలోకం ఒక అడుగుకి సరిపోయింది. నీ సంపద అంతా ఈనాడు రెండు అడుగులైంది. ఇక మూడవ అడుగుకు చోటెక్కడుంది. ఇస్తానన్న అర్ధాన్ని ఇవ్వనివాడు నరకాన్ని పొందడం నిజమే కదా! అందువల్ల, నీకు కొంచెంసేపటిలో నరకం ప్రాప్తిస్తుంది. సందేహం లేదు. అలాకాకుండా మూడవ అడుగు ఇవ్వదలుచుకుంటే ఆచోటు నాకు చూపించు. బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిన దానిని కాదనడానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు."
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=81&Padyam=641
: : చదువుకుందాం భాగవతం: బాగుపడదాం మనం అందరం : :