Saturday, June 26, 2021

శ్రీకృష్ణ విజయము - 266

( రుక్మిణీదేవి నూరడించుట )

10.2-273-చ.
ఎలమి ఘటింపఁగాఁ గలసి యీడెల నీడల మల్లికా లతా
వలిఁ గరవీరజాతి విరవాదుల వీథులఁ గమ్మ దెమ్మెరల్‌
వొలయు నవీనవాసములఁ బొన్నలఁ దిన్నెలఁ బచ్చరచ్చలం
గొలఁకుల లేఁగెలంకులను గోరిక లీరిక లొత్తఁ గ్రొత్తలై.
10.2-274-క.
ఆరామభూములందు వి
హారామల సౌఖ్యలీల నతిమోదముతో
నా రామానుజుఁ డుండెను
నా రామామణియుఁ దాను నభిరామముగన్.

భావము:
ఆ దంపతులు ఇద్దరూ కిత్తలి చెట్ల నీడలలో, మల్లెపొదలలో, విరజాజి నికుంజాలలో, గన్నేరుచెట్ల గుబురులలో, చిరుగాలులకు పులకరించే పొన్నచెట్ల క్రింది వేదికలపైనా, మరకతమణి సౌధాలలో సరోవరతీరాలలో తనివితీరా విహరించారు. బలరాముని సోదరుడైన శ్రీకృష్ణుడు రమణీయమైన ఉద్యానవనాలలో రమణీమణి అయిన రుక్మిణితో కూడి విహరించి ఆనందించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=27&Padyam=274

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: