Monday, June 14, 2021

శ్రీకృష్ణ విజయము - 257

( రుక్మిణిదేవి స్తుతించుట )

10.2-252-చ.
నిను వరియించినం బెలుచ నీరజలోచన! శార్‌ఙ్గ సాయకా
సన నినదంబులన్ సకల శత్రుధరాపతులన్ జయించి బో
రన పశుకోటిఁ దోలు మృగరాజు నిజాంశము భూరిశక్తిఁ గై
కొనిన విధంబునన్ నను నకుంఠిత శూరతఁ దెచ్చి తీశ్వరా!
10.2-253-ఉ.
అట్టి నృపాల కీటముల నాజి నెదుర్పఁగ లేనివాని య
ట్లొట్టిన భీతిమై నిటు పయోధిశరణ్యుఁడ వైతి వింతయున్
నెట్టన మాయ గాక యివి నిక్కములే? భవదీయ భక్తు లై
నట్టి నరేంద్రమౌళిమణు లంచిత రాజఋషుల్‌ ముదంబునన్.
10.2-254-ఆ.
వితత రాజ్యగరిమ విడిచి కాననముల
నాత్మలందు మీ పదాబ్జయుగము
వలఁతి గాఁగ నిలిపి వాతాంబు పర్ణాశ
నోగ్రనియతు లగుచు నుందు రభవ!

భావము:
ఓ నీరజలోచనా! మహాప్రభూ! నిన్నే అమితంగా వరించాను. ఆనాడు శార్ఙ్గ మనే నీ ధనుస్సు చేసిన టంకారంతో, సమస్త శత్రురాజులను జయించి మృగరాజు మృగాలను పారద్రోలి తన భాగాన్ని గ్రహించినట్లు, అసమాన శూరత్వంతో నీ దానను అయిన నన్ను పరిగ్రహించావు. అటువంటి రాచపురుగులను రణరంగంలో ఎదిరించలేక భయపడినట్లు, నీవు సముద్ర మధ్యంలో నివాసం ఏర్పాటు చేసుకున్నావు. ఇది నీ మాయ కాక వాస్తవమా? నీ భక్తులైన రాజాధిరాజులు రాజర్షులు సంతోషంతో ఓ జన్మరహితా! సమస్త రాజ్య సంపదలను వదలి అరణ్యాలకు వెళ్ళి నీ పాదపద్మాలనే ధ్యానిస్తూ; నీరు, గాలి, ఆకులు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉగ్రమైన నియమాలను పాటిస్తూ తపస్సులు చేస్తూ ఉంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=26&Padyam=254

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: