Monday, June 14, 2021

శ్రీకృష్ణ విజయము - 258

( రుక్మిణిదేవి స్తుతించుట )

10.2-255-మ.
విమలజ్ఞాననిరూఢులైన జనముల్‌ వీక్షింప మీ పాద కం
జమరందస్ఫుట దివ్యసౌరభము నాస్వాదించి నిర్వాణ రూ
పము సత్పూరుష వాగుదీరితము శోభాశ్రీనివాసంబు నౌ
మిము సేవింపక మానవాధముని దుర్మేధాత్ము సేవింతునే?
10.2-256-వ.
మఱియును దేవా! భూలోకంబునందును, నిత్యనివాసంబునందును, సకల ప్రదేశంబులందును జగదీశ్వరుండ వయిన నిన్ను నభిమతంబులయిన కామరూపంబులు గైకొని వరియింతు; భవదీయ చరణారవింద మకరందాస్వాదన చాతుర్యధుర్యభృంగియైన కామిని యతి హేయంబైన త్వక్‌ శ్మశ్రు రోమ నఖ కేశంబులచేతఁ గప్పంబడి యంతర్గతంబయిన మాంసాస్థి రక్త క్రిమి విట్కఫ పిత్త వాతంబుగల జీవచ్ఛవంబయిన నరాధముని మూఢాత్మయై కామించునే? యదియునుంగాక.

భావము:
నిర్మల జ్ఞానధనులు వీక్షిస్తుండగా మీ పాదకమల మకరంద మాధుర్య సౌరభాలను ఆస్వాదిస్తూ, మోక్ష దాయకమూ, సత్పురుషుల స్తుతికి పాత్రమూ, శుభావహమూ అయిన మీ మూర్తిని సేవించని చెడు బుద్ధి కలిగిన నీచ మానవుడిని ఎవరు సేవిస్తారు? ఓ దేవా! అంతేకాక, సకల చరాచర ప్రపంచానికి అధీశ్వరుడ వైన నిన్ను భూలోకంలోనూ, వైకుంఠంలోనూ సమస్త ప్రదేశాలలోనూ నేను అభిమతాలైన కామరూపాలు స్వీకరించి నిన్నే సేవిస్తాను. నీ పాదకమల మకరందాన్ని ఆనందంగా ఆస్వాదించే నేర్పుకల తుమ్మెద వంటి ఏ స్త్రీ అయినా, ఎముకలతో మాంసంతో చర్మాదులతో కప్పబడిన జీవచ్ఛవంలా ఉండే నరాధముణ్ణి ఎక్కడైనా కామిస్తుందా? అంతే కాకుండా....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=26&Padyam=256

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: