Saturday, June 26, 2021

శ్రీకృష్ణ విజయము - 265

( రుక్మిణీదేవి నూరడించుట )

10.2-269-క.
"అని యిట్లు కృష్ణుఁ డాడిన
వినయ వివేకానులాప వితతామృత సే
చన ముదిత హృదయయై య
వ్వనితామణి వికచ వదన వనరుహ యగుచున్.
10.2-270-క.
నగ వామతించు చూపులు
నగధరు మోమునను నిలిపి నయమునఁ గరముల్‌
మొగిచి వినుతించెఁ గృష్ణున్
ఖగవాహున్ రుచిరదేహుఁ గలితోత్సాహున్.
10.2-271-చ.
అతుల విరాజమానముఖుఁడై వివిధాంబర చారుభూషణ
ప్రతతులతోడఁ గోరిన వరంబులు దద్దయుఁ నిచ్చెఁ గృష్ణుఁ డు
న్నతశుభమూర్తి దేవగణనందితకీర్తి దయానువర్తియై
యతిమృదువాణికిం గిసలయారుణపాణికి నీలవేణికిన్.

భావము:
“ఈ విధంగా శ్రీకృష్ణుడు ఇంపుగా, ఊరడింపుగా, వినసొంపుగా పలికాడు. ఆ అమృతధారల వంటి ముచ్చట పలుకుల జల్లులకు రుక్మిణీదేవి మనసు సంతోషించింది; ముఖారవిందం సంతోషంతో వికసించింది. అప్పుడు రుక్మిణి చిరునవ్వుతో నిండిన చూపులతో శ్రీకృష్ణుడి వైపు చూసి, చేతులు జోడించి, ఆ గరుత్మంతుడు వాహనంగా గలవాడు, ఆ జగన్మోహనుడు, ఆ దేవదేవుడు, ఆ శ్రీకృష్ణుడిని స్తుతించింది. ఉన్నతమైన మంగళమూర్తీ, దయాపరిపూర్ణ వర్తనుడు, సకల దేవతల స్తోత్రాలకు పాత్రుడైన వాడు అయిన శ్రీకృష్ణుడు మిక్కిలి సంతోషంతో ప్రకాశించే ముఖం కలవాడై చిగురుటాకువలె ఎఱ్ఱని హస్తములూ, నల్లని కురులూ, మృదుమధుర పలుకులు పలుకునది అయిన రుక్మిణీదేవికి అనేక రకాల వస్త్రాలనూ, అందమైన ఆభరణాలనూ బహూకరించాడు కోరిన కోరికలు తీర్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=27&Padyam=271

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: