10.2-275-వ.
మఱియు, ననేకవిధ విచిత్రమణివితానాభిశోభిత ప్రాసాదోపరిభాగంబులను, లాలిత నీలకంఠ కలకంఠ కలవింక శుక కలాప కలిత తీరంబులను, మకరందపానమదవదిందిందిర ఝంకార సంకుల కమల కహ్లార సుధాసార నీహార పూరిత కాసారంబులను, ధాతు నిర్ఝర రంజిత సానుదేశగిరి కుంజపుంజంబులను, గృతకశైలంబులను, గ్రీడాగృహంబులనుం జెలంగి నందనందనుండు విదర్భరాజనందనం దగిలి కందర్పకేళీలోలాత్ముండయ్యె; ననంతరంబా సుందరీలాలామంబువలనఁ బ్రద్యుమ్నుండు, చారుధేష్ణుండు, చారుదేవుండు, సుధేష్ణుండు, సుచారువు, చారుగుప్తుండు, భద్రచారువు, చారుభద్రుండు, విచారువు, చారువు ననియెడు పదుగురు తనయులం బడసె; నట్లు సత్యభామా జాంబవతీ నాగ్నజితీ కాళిందీ మాద్రి మిత్రవిందా భద్రలకు వేఱువేఱ పదుగురేసి భద్రమూర్తు లైన కుమారు లుదయించి; రవ్విధంబున మఱియును.
భావము:
నానావిధములైన విచిత్రమణులతో శోభించే చాందినీలతో విలసిల్లె ప్రాసాదాలలోనూ; పెంపుడు నెమళ్ళతో, కోకిలలతో, పిచ్చుకలతో, చిలుకల పలుకులతో నిండినది; మకరందపానము చేసి మదించిన తుమ్మెదల ఝంకారములు నిండిన తెల్లని పద్మాలు, చల్లని మధుర జలాలతో కూడిన కమనీయ సరోవరతీరాలలో; ఖనిజాలపై ప్రవహించే జలప్రవాహాలతో ఎఱ్ఱనైన కొండచరియల పొదరిండ్లలో; లీలాపర్వతాలలో; క్రీడాగృహాలలో ఆ నందుని కుమారుడు శ్రీకృష్ణుడు, విదర్భరాకుమారి రుక్మిణీదేవితో కలిసి మన్మథవిలాసాలలో మునిగితేలాడు. అంతట, రుక్మిణీదేవి వలన శ్రీకృష్ణునకు “ప్రద్యుమ్నుడు, చారుధేష్ణుడు, చారుదేవుడు, సుధేష్ణుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుభద్రుడు, విచారువు, చారువు” అనే పదిమంది పుత్రులు కలిగారు. సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, కాళింది, మాద్రి, మిత్రవింద, భద్రలకు కూడా ఒక్కొక్కరికి పదిమంది చొప్పున అందమైన కుమారులు ఉదయించారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=28&Padyam=275
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :