Friday, May 28, 2021

శ్రీకృష్ణ విజయము - 239

( పారిజాతాపహరణంబు )

10.2-217-సీ.
నరకాసురుని బాధ నలఁగి గోవిందుని-
  కడ కేగి తత్పాదకమలములకుఁ
దన కిరీటము సోఁక దండప్రణామము-
  ల్గావింప నా చక్రి కరుణ సేసి
చనుదెంచి భూసుతు సమయించి తనవారిఁ-
  దన్ను రక్షించుటఁ దలఁప మఱచి
యింద్రుండు బృందారకేంద్రత్వ మదమునఁ-
  "బద్మలోచన! పోకు పారిజాత
10.2-217.1-ఆ.
తరువు విడువు" మనుచుఁ దాఁకె నడ్డము వచ్చి
తఱిమి సురలు నట్లు దాఁకి రకట!
యెఱుకవలదె నిర్జరేంద్రత కాల్పనే?
సురల తామసమును జూడ నరిది.
10.2-218-వ.
ఇట్లు దనకు నొడ్డారించి యడ్డంబు వచ్చిన నిర్జరేంద్రాదుల నిర్జించి తన పురంబునకుం జని, నిరంతర సురభి కుసుమ మకరంద మాధురీ విశేషంబులకుఁ జొక్కిచిక్కక నాకలోకంబుననుండి వెంటనరుగుదెంచు తుమ్మెదలకు నెమ్మిదలంచుచున్న పారిజాతమ్ము నాశ్రితపారిజాతుం డయిన హరి మహాప్రేమాభిరామ యగు సత్య భామతోఁ గ్రీడించు మహోద్యానంబున సంస్థాపించి, నరకాసురుని యింటం దెచ్చిన రాజకన్యక లెందఱందఱకు నన్నినివాసంబులు గల్పించి గృహోపకరణంబులు సమర్పించి.

భావము:
ఇంద్రుడు తాను త్రిలోకాధిపతిననే గర్వంతో “ఓ శ్రీకృష్ణా! దొంగతనంగా పారిజాతవృక్షాన్ని పట్టుకుపోవద్దు. విడువు. విడువు.” అని త్రోవకు అడ్డం వచ్చి శ్రీకృష్ణుడిని ఎదిరించాడు. దేవతాసైన్యం శ్రీకృష్ణుడిమీద యుద్ధానికి వచ్చింది. నరకాసురుడు పెట్టే బాధలకు ఓర్చుకోలేక, తాను శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఆయన పాదాలకు తన కిరీటం సోకేలా సాష్టాంగ నమస్కారం చేస్తే, కృష్ణుడు దయతలచి నరకాసురుడిని సంహరించి, దేవతలను రక్షించిన సంగతి దేవేంద్రుడు మరచిపోయాడు. ఆపాటి వివేకంలేని దేవేంద్రపదవి ఎందుకు? దేవతల అహంకారం చాలా విచిత్రంగా ఉంది. తనను ఎదిరించిన దేవేంద్రాదులను ఓడించి, ఆశ్రితపారిజాతమైన శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చి, తనను గొప్పగా ప్రేమించే సత్యభామతో తాను విహరించే ఉద్యానవనంలో నాటించాడు. దేవలోకపు తుమ్మెదలు సువాసనలు విరజిమ్మే పారిజాతవృక్షాన్ని అనుసరించి కూడా వచ్చేసాయి. శ్రీకృష్ణుడు నరకాసురుడి బారినుండి తప్పించి తెచ్చిన రాజకన్యకలు అందరకీ వేరు వేరుగా సౌధాలను, కావలసిన గృహోపకరణాలను ఏర్పాటు చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=23&Padyam=217

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: