10.2-179-మ.
అలినీలాలక చూడ నొప్పెసఁగెఁ బ్రత్యాలీఢ పాదంబుతో
నలికస్వేద వికీర్ణకాలకలతో నాకర్ణికానీత స
ల్లలితజ్యానఖపుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో
వలయాకార ధనుర్విముక్త విశిఖవ్రాతాహతారాతియై.
10.2-180-సీ.
బొమ్మ పెండిండ్లకుఁ బో నొల్ల నను బాల-
రణరంగమున కెట్లు రాఁ దలంచె?
మగవారిఁ గనినఁ దా మఱుఁగుఁ జేరెడు నింతి-
పగవారి గెల్వనే పగిదిఁ జూచెఁ?
బసిఁడియుయ్యెల లెక్క భయ మందు భీరువు-
ఖగపతి స్కంధమే కడిఁది నెక్కె?
సఖుల కోలాహల స్వనము లోర్వని కన్య-
పటహభాంకృతుల కెబ్భంగి నోర్చె?
10.2-180.1-ఆ.
నీలకంఠములకు నృత్యంబుఁ గఱపుచుఁ
నలసి తలఁగిపోవు నలరుఁబోఁడి
యే విధమున నుండె నెలమి నాలీఢాది
మానములను రిపులమాన మడఁప?
భావము:
తుమ్మెద నీలం ముంగురులతో అలరారుతున్న ఆ సత్యభామ, ఎడమపాదం ముందుకు పెట్టి కుడికాలు వంచి చెమటకు తడిసి ముఖాన వ్యాపించిన ముంగురులతో చెవిదాకా లాగిన అల్లెత్రాటిని పట్టుకున్న చేతివేళ్ళ గోళ్ళ కాంతులతో వైరిసమూహం వైపు గురిచూస్తూ గుండ్రని ధనుస్సు నుండి వదలుతున్న శరపరంపరలతో శత్రువులను సంహరిస్తూ శోభిల్లింది. బొమ్మల పెండ్లిండ్లకే వెళ్ళని ముద్దరాలు, యుద్ధరంగాని కెలా రావాలని భావించిందో? మగవారిని చూడగానే చాటుకు వెళ్ళే లతాంగి, పగవారిని గెలవాలని ఎలా అనుకుందో? బంగారు ఉయ్యాలలు ఎక్కడానికి భయపడే పడతి, గరుత్మంతుడి వీపుపై ఎలా ఎక్కిందో? చెలికత్తెల కోలాహలమే ఆలకింపలేని ముగ్ధ, భేరీలు తప్పెట్ల భీకర ధ్వనులను ఎలా ఓర్చుకుంటున్నదో? నెమిళ్ళకు నాట్యం నేర్పించి అలసిపోయే అబల, ఎడమపాదం ముందు కుంచి కుడిపాదం వంచి సంగరరంగంలో శత్రువుల అభిమానాన్ని అంతం చేయడానికి ఎలా సిద్ధమైందో? అంతా వింతే.
విశేషాలు:
అసలే అసమాన సౌందర్య నారీ రత్నం, మథురానగరి అంతఃపుర వాసిని, శ్రీకృష్ణునంతటి వాని పట్టపు మహిషి. హంసతూలికా తల్పములు, బంగరు తూగుటుయ్యలలు, నానావిధ భూషణ, లేపనాదుల సౌఖ్యాలకు అలవాలమైన జీవన శైలి. అట్టి కాంతామణి కఠోర భీకర రాక్షసమూకలతో యుద్ధానికి వచ్చిందట. అది కేళీ వేదికలపై నుండి చెలులతో చేసే లీలారణరంగం కాదు. ఎత్తున ఎగురుతూ ఉండే పక్షీంద్రుని మూపున ఉండి అస్త్ర శస్త్రాల పరంపరలతో ఏమరుపా టన్నది లేని అరివీర భయంకర యుద్ధం. దానికి తగ్గని సందర్భశుద్ధి, వ్యక్తిత్వ పరిపుష్టి ప్రకటనలు చూపుతూ; లలిత లావణ్యాలు వదలకుండా, కర్కశ రణకౌశలం చూపుతూ; శృంగార రసం, వీరరసం కలిసి ఉప్పొంగి పారాయి; మన పోతనామాత్యుల వారి గంటంనుండి జాలువారాయి; మన మానస వాకిళ్ళను అలరారిస్తూ, ఇదేకాదు ముందరి అయిదు, తరువాతి మూడు పద్యాల పోకిళ్ళు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=20&Padyam=180
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment