( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )
4-66-క.
అనఘా! విను లోకంబుల
జనకుని గేహమునఁ గలుగు సకల సుఖంబుల్
తనయలు చని సంప్రీతిం
గనుఁగొన కే రీతి నిలుచుఁ గాయము లభవా!
4-67-క.
అనయముఁ బిలువక యుండం
జన ననుచిత మంటివేని జనక గురు సుహృ
జ్జననాయక గేహములకుఁ
జనుచుందురు పిలువకున్న సజ్జను లభవా!"
4-68-వ.
అని మఱియు నిట్లనియె “దేవా! నా యందుఁ బ్రసన్నుండవై మదీయ మనోరథంబుం దీర్ప నర్హుండవు; సమధిక జ్ఞానంబు గల నీచేత నేను భవదీయదేహంబు నందర్ధంబున ధరియింపంబడితి; నట్టి నన్ను ననుగ్రహింపవలయు” నని ప్రార్థించిన మందస్మితవదనారవిందుం డగుచు జగత్స్రష్టల సమక్షంబున దక్షుండు తన్నాడిన మర్మభేదంబు లైన కుహక వాక్యసాయకంబులం దలంచుచు నిట్లనియె.
భావము:
మహాత్మా! విను. లోకంలో తండ్రి యింట జరిగే శుభకార్యాలను చూడటానికి వెళ్ళకుండా ఏ కుమార్తెల ప్రాణాలు నిలుస్తాయి? అభవా! పిలువకుండా వెళ్ళడం తగదని మీరు అనవచ్చు. తండ్రి, గురువు, మిత్రులు, రాజు మొదలైనవారి యిండ్లకు పిలువకపోయినా సజ్జనులైనవారు వెళ్తారు కదా! అని చెప్పి సతీదేవి మళ్ళీ ఇలా అన్నది “దేవా! నా పట్ల ప్రసన్నబుద్ధితో నా కోరికను తీర్చగలవాడవు నీవు. జ్ఞానవంతుడవైన నీచేత అర్ధశరీరాన్ని పొందినదానను. అటువంటి నన్ను అనుగ్రహించు” అని ప్రార్థించగా శివుడు చిరునవ్వు నవ్వుతూ పూర్వం సృష్టికర్తలైన ప్రజాపతుల సన్నిధిలో దక్షుడు తనను పలికిన బాణాలవంటి మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని సతీదేవితో ఇలా అన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=67
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment