Wednesday, January 22, 2020

దక్ష యాగము - 9


( ఈశ్వర దక్షుల విరోధం )

4-48-మ.
"అనయంబుం దన మానసంబున నవిద్యన్ ముఖ్యతత్త్వంబు గాఁ
గని గౌరీశుఁ దిరస్కరించిన యసత్కర్మాత్ము నీ దక్షుని
న్ననువర్తించినవాఁరు సంసరణకర్మారంభుఁలై నిచ్చలున్
జననం బందుచుఁ జచ్చుచున్ మరల నోజం బుట్టుచున్ వర్తిలున్.
4-49-వ.
అదియునుం గాక యీ హరద్వేషులైన ద్విజు లర్థవాద బహుళంబు లైన వేదవాక్యంబుల వలన మధుగంధ సమంబైన చిత్తక్షోభంబుచేత విమోహిత మనస్కులై కర్మాసక్తు లగుదురు; మఱియును భక్ష్యాభక్ష్య విచారశూన్యులై దేహాది పోషణంబుకొఱకు ధరియింపఁ బడిన విద్యా తపోవ్రతంబులు గలవారలై ధన దేహేంద్రియంబుల యందుఁ బ్రీతిం బొంది యాచకులై విహరింతురు;” అని నందికేశ్వరుండు బ్రాహ్మణజనంబుల శపియించిన వచనంబులు విని భృగుమహాముని మరల శపి యింపం బూని యిట్లనియె.


భావము:
“ఎల్లప్పుడు అజ్ఞానాన్నే జ్ఞానంగా భ్రమించి దేవదేవుడైన మహాదేవుని నిందించిన ఈ మహాపాపిని అనుసరించేవారు సర్వదా సంసారంలో చిక్కుకుని పుడ్తూ చస్తూ మళ్ళీ పుడ్తూ ఉందురు గాక! అంతేకాక శివుని ద్వేషించే ఇందలి బ్రాహ్మణులు అర్థవాదాలతో నిండిన వేదవాక్యాలవల్ల కల్లుకైపు వంటి మనోమాలిన్యంతో కలత చెంది మోహపడి అసత్కర్మలపై ఆసక్తి పెంచుకుంటారు. తినదగినవి, తినదగనివి అనే ఆలోచన నశించి అన్నింటినీ ఆరగిస్తారు. విద్యను, తపస్సును, వ్రతాలను పొట్టకోసమే అవలంబిస్తారు. ధనంమీద, దేహంమీద, ఇంద్రియాలమీద ఆదరాభిమానాలు కలవారై యాచకులై సంచరిస్తారు” అని నందికేశ్వరుడు అచ్చటి బ్రాహ్మణులను శపించాడు. నంది శాపవాక్కులు విని భృగుమహర్షి తిరిగి ఇలా శపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=49

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: