Friday, January 24, 2020

దక్ష యాగము - 14


( ఈశ్వర దక్షుల విరోధం )

4-59-క.
సతి దన పతి యగు నా పశు
పతిఁ జూచి సముత్సుకతను భాషించె;"ప్రజా
పతి మీ మామ మఖము సు
వ్రతమతి నొనరించుచున్న వాఁడఁట వింటే;
4-60-క.
కావున నయ్యజ్ఞమునకు
నీ విబుధగణంబు లర్థి నేగెద; రదిగో!
దేవ! మన మిప్పు డచటికిఁ
బోవలె నను వేడ్క నాకుఁ బుట్టెడు నభవా!
4-61-క.
ఆ యజ్ఞముఁ గనుగొనఁగా
నా యనుజలు భక్తిఁ బ్రాణనాథుల తోడం
బాయక వత్తురు; మనముం
బోయిన నే వారి నచటఁ బొడగనఁ గల్గున్.


భావము:
అప్పుడు సతీదేవి అతిశయించిన కుతూహలంతో తన ప్రాణేశ్వరుడైన పరమేశ్వరునితో ఇలా అంటోంది “విన్నారా! మీ మావగారు దక్షప్రజాపతి దీక్షాపరుడై యజ్ఞం చేస్తున్నా డట! కనుక ఆ యజ్ఞాన్ని చూదాలనే వేడుకతో అదుగో ఆ దెవతలంతా గుంపులుగా వెళ్తున్నారు. స్వామీ! మనం ఇప్పుడే అక్కడికి వెళ్ళాలనే కోరిక నాకు కలుగుతున్నది. ఆ యజ్ఞాన్ని చూడడానికి నా చెల్లెళ్ళు అందరు, తమ తమ భర్తలతో తప్పకుండా వస్తారు. మనమూ వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళనందరినీ చూచే అవకాశం నాకు కలుగుతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=61

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: