( ఈశ్వర దక్షుల విరోధం )
4-47-వ.
ఇట్లు దక్షుండు పల్కిన గర్హితవాక్యంబులు వినిందితంబు లగుం గాని యాథార్థ్యంబున వాస్తవంబు లగుచు భగవంతుండగు రుద్రునందు నిందితంబులు గాక స్తుతి రూపంబున నొప్పెఁ; దదనంతరంబ రుద్రునకు శాపం బిచ్చిన కారణంబున దక్షుండు సదస్యముఖ్యులచే 'నకృత్యం' బని నిషేధింపబడి ప్రవృద్ధంబయిన క్రోధంబుతోడ నిజనివాసంబునకుం జనియె; అంత గిరిశానుచరాగ్రేసరుం డగు నందికేశ్వరుండు దక్షుండు నిటలాక్షుని శపియించిన శాపంబు, నతనిఁ బల్కిన యనర్హ వాక్యంబులును విని కోపారుణితలోచనుండై యిట్లను “నీ దక్షుండు మర్త్యశరీరంబు శ్రేష్ఠంబు గాఁ దలఁచి యప్రతిద్రోహియైన భగవంతునందు భేదదర్శియై యపరాధంబుఁ గావించె; ఇట్టి మూఢాత్ముండు దత్త్వ విముఖుం డగు; మఱియుం గూటధర్మంబు లయిన నివాసంబుల గ్రామ్యసుఖకాంక్షలం జేసి సక్తుండై యర్థవాదంబు లైన వేదంబులచేత నష్టమనీషం గలిగి కర్మతంత్రంబు విస్తృతంబు చేయు; వెండియు దేహాదికంబు లుపాదేయంబులు గాఁ దలఁచుచు బుద్దిచేత నాత్మతత్త్వంబు మఱచి వర్తించుచుఁ బశుప్రాయుండై స్త్రీకాముండు నగు; నిదియునుం గాక దక్షుం డచిరకాలంబున మేషముఖుం డగు" నని మఱియు.
భావము:
ఈ విధంగా దక్షుడు పలికిన నిందావాక్యాలు పైకి అనుచితాలుగా తోచినా మరొక అర్థంలో వాస్తవాలై, సముచితాలై పూజ్యుడైన శివునికి పొగడ్తలే అయ్యాయి. ఆ తరువాత శివుని శపించిన దక్షుణ్ణి చూచి సభ్యులు “నీవు చేసినది చెడ్డపని” అని అడ్డుకోగా, దక్షుడు ఆగ్రహోదగ్రుడై తన గృహానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శివుని సేవకులలో శ్రేష్ఠుడైన నందికేశ్వరుడు దక్షుడు పరమేశ్వరుని నిందించడం, శపించడం విని కోపంతో కన్నులెఱ్ఱవారగా ఇలా అన్నాడు “ఈ దక్షుడు తన మర్త్యశరీరం గొప్పది అని భావించాడు. తనకు తిరిగి కీడు చేయకుండా శాంతుడై ఉన్న దేవదేవునికి అపరాధం చేశాడు. వీడు భేదదర్శి. ఇటువంటి మూర్ఖునికి తత్త్వదర్శనం లభించదు. వీడు కుటిల ధర్మాలను ఆశ్రయించి నీచసుఖాలపై కోర్కెలు పెంచుకున్నాడు. వేదాలలోని అర్థవాదాలను నిజమని నమ్మాడు. దేహమునే ఆత్మగా భావిస్తాడు. అందుచేత వీడు సత్యమైన ఆత్మతత్త్వాన్ని విస్మరించి పశువుతో సమానమౌతాడు. వీడు స్త్రీలోలుడై చెడిపోతాడు. అంతేకాదు, ఈ దక్షుడు తొందరలోనే గొర్రెతలవాడు అగుగాక” అని ఇంకా...
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=47
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment