( ఈశ్వర దక్షుల విరోధం )
4-56-తే.
దక్షతనయ సతీదేవి దవిలి యాత్మ
సదనమున నుండి జనకుని సవనమహిమ
గగన చరులు నుతింప నా కలకలంబు
విని కుతూహలిని యయి విన్వీథిఁ జూడ.
4-57-వ.
అయ్యవసరంబునఁ దదుత్సవ దర్శన కుతూహలులై సర్వదిక్కుల వారును జనుచుండి; రా సమయంబున.
4-58-సీ.
తనరారు నవరత్న తాటంక రోచులు;
చెక్కుటద్దములతోఁ జెలిమి చేయఁ;
మహనీయ తపనీయమయ పదకద్యుతు;
లంసభాగంబుల నావరింప;
నంచిత చీనిచీనాంబర ప్రభలతో;
మేఖలాకాంతులు మేలమాడఁ;
జంచల సారంగ చారు విలోచన;
ప్రభలు నల్దిక్కులఁ బ్రబ్బికొనఁగ;
4-58.1-తే.
మించు వేడుక భర్తృసమేత లగుచు
మానితంబుగ దివ్య విమానయాన
లగుచు నాకాశపథమున నరుగుచున్న
ఖచర గంధర్వ కిన్నరాంగనలఁ జూచి.
భావము:
దక్షుని కూతురైన సతీదేవి తన ఇంటిలో ఉన్నదై తండ్రి చేస్తున్న యజ్ఞవైభవాన్ని దేవతలు పొగడుతుండగా ఆ కలకలాన్ని విని ఆకాశంవైపు చూడగా అప్పుడు ఆ యజ్ఞవైభవాన్ని చూడాలనే కుతూహలంతో అన్నిదిక్కులవారు వెళ్తున్నారు. ఆ సమయంలో నవరత్నాలు తాపిన చెవికమ్మల కాంతులు అద్దాలవంటి చెక్కిళ్ళపై పడుతుండగా, మేలిమి బంగారు పతకాల కాంతులు భుజాలపై వ్యాపించగా, చీని చీనాంబరాల కాంతులు మొలనూళ్ళ కాంతులతో కలిసి మెరుస్తుండగా, లేడికన్నుల వెలుగులు నాలుగు దిక్కులా ప్రసరిస్తుండగా ఉరకలు వేసే ఉత్సాహంతో తమ తమ భర్తలతో కూడి దివ్యవిమానాలను అధిరోహించి దేవతాస్త్రీలు ఆకాశంలో వెళ్తుండగా సతీదేవి చూచి...
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=58
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment