Thursday, January 23, 2020

దక్ష యాగము - 12


( ఈశ్వర దక్షుల విరోధం )

4-54-వ.
“అంత శ్వశురుండగు దక్షునకు జామాత యైన భర్గునకు నన్యోన్య విరోధంబు పెరుఁగుచుండ నతిచిరంబగు కాలం బరిగె; నంత దక్షుండు రుద్రవిహీనంబగు యాగంబు లేనిది యైనను శర్వుతోడి పూర్వ విరోధంబునను బరమేష్ఠి కృతంబైన సకల ప్రజాపతి విభుత్వగర్వంబు ననుం జేసి బ్రహ్మనిష్ఠులగు నీశ్వరాదుల ధిక్కరించి యరుద్రకంబుగా వాజపేయ సవనంబు గావించి తదనంతరంబ బృహస్పతిసవన నామకం బైన మఖంబు చేయ నుపక్రమించిన నచ్చటికిం గ్రమంబున.
4-55-చ.
కర మనురక్తి నమ్మఖముఁ గన్గొను వేడుక తొంగలింపఁగాఁ
బరమమునిప్రజాపతి సుపర్వ మహర్షి వరుల్ సభార్యులై
పరువడి వచ్చి యందఱు శుభస్థితి దీవన లిచ్చి దక్షుచేఁ
బొరిఁబొరి నచ్చటన్ విహిత పూజల నొందిరి సమ్మదంబునన్.


భావము:
అప్పుడు మామ అయిన దక్షునికి, అల్లుడైన శివునికి పరస్పర వైరం నానాటికీ పెరుగుచుండగా చాలాకాలం గడిచింది. బ్రహ్మ దక్షుణ్ణి ప్రజాపతులందరికీ అధ్యక్షుణ్ణి చేయగా ఆ అధికారగర్వంచేత, పరమేశ్వరునిపై ఉన్న పగచేత దక్షుడు బ్రహ్మవేత్తలను, పరమేశ్వరుణ్ణి ధిక్కరించి, రుద్రహీనమైన వాయపేయం అనే యజ్ఞాన్ని చేసాడు. తరువాత బృహస్పతి సవనం అనే యజ్ఞాన్ని చేయటానికి పూనుకోగా అక్కడికి క్రమంగా ఆ యజ్ఞాన్ని చూడాలని వేడుకతో మునులు, ప్రజాపతులు, దేవతలు, మహర్షులు సదస్యులుగా వచ్చి, దక్షుణ్ణి దీవించారు. అతడు చేసిన పూజలను సంతోషంగా అందుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=55

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: