( సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట )
4-81-చ.
మనమున మోదమందుచు నుమాతరుణీమణి గాంచె దారు మృ
త్కనక కుశాజినాయస నికాయ వినిర్మిత పాత్ర సీమము
న్ననుపమ వేదఘోష సుమహత్పశు బంధన కర్మ భూమమున్
మునివిబుధాభిరామము సముజ్జ్వల హోమము యాగధామమున్.
4-82-వ.
ఇట్లు గనుంగొని యజ్ఞశాలం బ్రవేశించిన.
4-83-క.
చనుదెంచిన యమ్మగువను
జననియు సోదరులుఁ దక్క సభఁ గల జను లె
ల్లను దక్షువలని భయమున
ననయము నపు డాదరింపరైరి మహాత్మా!
4-84-క.
నెఱిఁ దల్లియుఁ బినతల్లులుఁ
బరిరంభణ మాచరింపఁ బరితోషాశ్రుల్
దొరఁగఁగ డగ్గుత్తికతో
సరసిజముఖి సేమ మరయ సతి దా నంతన్.
భావము:
సతీదేవి మనస్సులో సంతోషిస్తూ యజ్ఞశాలను చూసింది. ఆ యజ్ఞశాలలో కొయ్యతో, మట్టితో, బంగారంతో, లోహంతో చేసిన పాత్రలున్నాయి. దర్భలతో, జింకతోళ్ళతో చేసిన వస్తువులు ఉన్నాయి. వేదఘోషలు మిన్ను ముట్టుతున్నాయి. ఒకచోట యజ్ఞ పశువును బంధించారు. మునులు, దేవతలు తమతమ స్థానాలలో కూర్చుని ఉన్నారు. హోమాలు చేస్తున్నారు. యజ్ఞం వైభవోపేతంగా జరుగుతున్నది. ఇదంతా చూస్తూ యజ్ఞశాలలోకి ప్రవేశించగా విదురా! వచ్చిన సతీదేవిని చూడగానే తల్లి, తోబుట్టువులు అనురాగంతో ఆదరించారు. సభలో ఉన్న తక్కినవారు దక్షునికి భయపడి ఆమెను గౌరవించకుండా ఊరకున్నారు. తల్లి, పినతల్లులు సతీదేవిని కౌగలించుకొని ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గదస్వరంతో కుశలప్రశ్నలు వేయగా, సతీదేవి అప్పుడు...
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&padyam=84
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment