( ఈశ్వర దక్షుల విరోధం )
4-52-వ.
ఇట్లన్యోన్యంబును శాపంబులం బొందియు భగవదనుగ్రహంబు గల వారలగుటం జేసి నాశంబు నొందరైరి; అట్టి యెడ విమనస్కుం డగుచు ననుచర సమేతుం డై భవుండు చనియె నంత.
4-53-సీ.
అనఘాత్మ! యే యజ్ఞమందు సర్వశ్రేష్ఠుఁ;
డగు హరి సంపూజ్యుఁడై వెలుంగు
నట్టి యజ్ఞంబు సమ్యగ్విధానమున స;
హస్ర వత్సరములు నజుఁ డొనర్చెఁ
గరమొప్ప నమర గంగాయమునా సంగ;
మావనిఁ గలుగు ప్రయాగ యందు
నవభృథస్నానంబు లతిభక్తిఁ గావించి;
గతకల్మషాత్ములై ఘనత కెక్కి
4-53.1-తే.
తగ నిజాశ్రమభూములఁ దలఁచి వార
లందఱును వేడ్కతోఁ జని రనుచు" విదురు
నకును మైత్రేయుఁ డను మునినాయకుండు
నెఱుఁగ వినిపించి వెండియు నిట్టు లనియె.
భావము:
ఈ విధంగా నందీశ్వరుడు, భృగుమహర్షి ఒకరినొకరు శపించుకున్నారు. దైవానుగ్రహంవల్ల వారు నశింపలేదు. అప్పుడు వ్యాకుల హృదయుడై శివుడు అనుచరులతో అక్కడినుండి వెళ్ళిపోయాడు. పుణ్యాత్మా! సర్వశ్రేష్ఠుడైన నారాయణుడు ఏ యజ్ఞంలో పూజనీయుడో అటువంటి యజ్ఞాన్ని బ్రాహ్మణులు వేయి సంవత్సరాలు యథావిధిగా చేశారు. గంగా యమునలు సంగమించే ప్రయాగక్షేత్రంలో సదస్యులు దీక్షా స్నానాలు చేసి పాపాలు పోగొట్టుకొని తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు” అని మైత్రేయ మహర్షి విదురునితో చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&padyam=53
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment