Saturday, August 24, 2019

కపిల దేవహూతి సంవాదం - 97


( గర్భ సంభవ ప్రకారంబు )

3-1007-వ.
దీని కొక్క యితిహాసంబు గలదు; 'తొల్లి యొక్కనాడు ప్రజాపతి దన కూఁతు రయిన భారతి మృగీరూపధారిణి యై యుండం జూచి తదీయ రూపరేఖా విలాసంబులకు నోటువడి వివశీకృతాంతరంగుండును విగత త్రపుండును నై తానును మృగరూపంబు నొంది తదనుధావనంబు హేయం బని తలంపక ప్రవర్తించెం;' గావున నంగనాసంగమంబు వలవ; దస్మదీయ నాభికమల సంజాత చతుర్ముఖ నిర్మిత మరీచ్యాద్యుద్భూత కశ్యపాది కల్పిత దేవ మనుష్యాదు లందు మాయా బలంబునం గామినీజన మధ్యంబున విఖండిత మనస్కుండు గాకుండఁ బుండరీకాక్షుండైన నారాయణఋషికిం దక్క నన్యులకు నెవ్వరికిం దీరదు" అని వెండియు నిట్లనియె.

భావము:
దీనికొక ప్రాచీన కథ ఉంది. పూర్వం ఒకనాడు బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతి ఆడులేడి రూపాన్ని ధరించి ఉండగా చూచి, ఆమ సౌందర్య లావణ్యాలకు మురిసిపోయి, పరవశించిన హృదయంతో సిగ్గు విడిచి, తానుకూడ మగలేడి రూపాన్ని ధరించి నీచమని భావించకుండా ఆమె వెంటబడి పరుగులెత్తాడు. కాబట్టి పురుషునకు స్త్రీసాంగత్యం తగదు. నా నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మ, అతనిచే సృష్టింపబడిన మరీచి ప్రముఖులు, వారికి పుట్టిన కశ్యపాదులు, వీరిచే కల్పించబడిన దేవతలు, మనుష్యులు, వీరందరిలోను చక్కదనాల చుక్కలైన రమణీమణుల మాయలకు చిక్కకుండా మొక్కవోని మనస్సు కలిగి ఉండడం అన్నది పుండరీకాక్షుడైన ఒక్క నారాయణ మహర్షికే తప్ప ఇతరులకు ఎవ్వరికీ సాధ్యం కాదు” అని కపిలుడు మళ్ళీ ఇలా చెప్పాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=1007

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: