Monday, August 12, 2019

కపిల దేవహూతి సంవాదం - 86


(గర్భ సంభవ ప్రకారంబు)

3-991-సీ.
"కైకొని మఱి పూర్వకర్మానుగుణమున; 
శశ్వత్ప్రకాశకుం డీశ్వరుండు
ఘటకుండు గావునఁ గ్రమ్మఱ జీవుండు; 
దేహసంబంధంబుఁ దివిరి తాల్ప
దొరఁకొని పురుషరేతోబిందుసంబంధి; 
యై వధూగర్భంబు నందుఁ జొచ్చి
కైకొని యొకరాత్రి గలిలంబు పంచరా; 
త్రముల బుద్బుదమును దశమ దివస
3-991.1-తే.
మందు గర్కంధు వంత యౌ నంతమీఁదఁ
బేశి యగు నంతమీఁదటఁ బేర్చి యండ
కల్ప మగు నొక్క నెల మస్తకమును మాస
యమళమైనను గరచరణములుఁ బొడము
గర్భస్థ పిండం దశలు

భావము:
“ఈశ్వరుడు శాశ్వతంగా ప్రకాశించేవాడు, అన్నిటినీ సంఘటిత పరిచేవాడు కాబట్టి జీవుడు తన పూర్వకర్మలను అనుసరించి మళ్ళీ దేహాన్ని పొందగోరుతాడు. జీవుడు పురుషుని వీర్యబిందు సంబంధంతో స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఒక్క రాత్రికి శుక్రశోణితాల ద్రవరూపమైన కలిలమై, తర్వాత ఐదురాత్రులకు బుద్బుదమై, ఆపైన పదవదినానికి రేగుపండంత అయి, అనంతరం మాంసపిండమై గ్రుడ్డు ఆకారం పొందుతాడు. ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది. రెండు నెలలకు కాళ్ళు చేతులు వస్తాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=991

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: