Thursday, August 8, 2019

కపిల దేవహూతి సంవాదం - 85


(భక్తి యోగం)

3-989-ఉ.
ముంతురు తప్తతోయముల మొత్తుదు రుగ్రగదాసిధారలం
దెంతురు పొట్ట ప్రేవులు వధింతురు మీఁద నిభేంద్ర పంక్తి ఱొ
ప్పింతురు ఘోర భంగిఁ గఱపింతురు పాములచేత బిట్టు ద్రొ
బ్బింతురు మీఁద గుండ్లు దినిపింతురు దేహముఁ గోసి కండలన్.
3-990-వ.
మఱియుఁ గుటుంబపోషణంబునఁ గుక్షింభరుం డగుచు నధర్మపరుం డై భూతద్రోహంబున నతిపాపుండై నిరయంబునుం బొంది నిజ ధనంబులు గోలుపడి మొఱవెట్టు నాపన్నుని చందంబునం బరస్పర సంబంధంబునఁ గల్పింపబడిన తమిస్రాంధతామిస్ర రౌరవాదు లగు నరకంబులం బడి తీవ్రంబు లయిన బహుయాతనల ననుభవించి క్షీణపాపుండై పునర్నరత్వంబునుం బొందు" నని చెప్పి వెండియు నిట్లనియె.

భావము:
వేడినీళ్ళలో ముంచుతారు. పెద్ద గదలతోను, కత్తులతోను మొత్తుతారు. పొట్టలోని ప్రేవులను త్రెంచుతారు. మదపుటేనుగులతో త్రొక్కిస్తారు. పాములచేత క్రూరంగా కరిపిస్తారు. బండరాళ్ళు మీదకు విసరుతారు. అతని దేహాన్ని కోసి ఆ కండలను ఆ పాపాత్మునిచేతనే తినిపిస్తారు. పాపాత్ముడు సంసార పోషణకై పడరాని పాట్లు పడుతూ, తన పొట్టను నింపుకొంటూ, అధర్మమార్గంలో నడుస్తూ, ప్రాణులను హింసిస్తూ మహాపాపం మూటకట్టుకొని యమలోకానికి పోయి అక్కడ తన సొమ్మును పోగొట్టుకొని మొరపెట్టుకునే దిక్కులేని దీనునివలె ఆక్రోశిస్తూ ఒకదాని వెంట ఒకటిగా తామిస్రం, అంధతామిస్రం, రౌరవం మొదలైన నరకాలలో పడి సహింపరాని పెక్కు బాధలను అనుభవిస్తూ, తన పాపాలన్నీ తరిగిపోయిన తరువాత మళ్ళీ మనుష్యజన్మను పొందుతాడు” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=990

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: