Thursday, August 15, 2019

కపిల దేవహూతి సంవాదం - 89


( గర్భ సంభవ ప్రకారంబు )

3-995-సీ.
ఎవ్వఁడు నిఖిల భూతేంద్రియమయ మగు; 
మాయావలంబున మహితకర్మ
బద్ధుఁడై వర్తించు పగిది దందహ్యమా; 
నంబగు జీవ చిత్తంబు నందు
నవికారమై శుద్ధమై యఖండజ్ఞాన; 
మున నుండు వానికి ముఖ్యచరితు
నకు నకుంఠితశౌర్యునకుఁ పరంజ్యోతికి; 
సర్వజ్ఞునకుఁ గృపాశాంతమతికిఁ
3-995.1-తే.
గడఁగియుఁ బ్రకృతిపురుషుల కంటెఁ బరముఁ
డయిన వానికి మ్రొక్కెద నస్మదీయ
దుర్భరోదగ్ర భీకర గర్భనరక
వేదనలఁ జూచి శాంతిఁ గావించు కొఱకు."

భావము:
ఏ దేవుడు సమస్త జీవరాసులలో పంచేంద్రియాలతో పంచభూతాలతో నిండిన మాయను అంగీకరించి కర్మబంధాలకు లోబడి ఉన్నట్లు కన్పిస్తాడో, దహించుకొని పోతున్న జీవుని చిత్తంలో అవికారుడై, పరిశుద్ధుడై, అఖండజ్ఞాన స్వరూపుడై భాసిస్తుంటాడో ఆ ఉదాత్త చరితునికి, ఆ మొక్కవోని శౌర్యం కలవానికి, ఆ పరంజ్యోతికి, ఆ దయామయునికి, ఆ శాంతమూర్తికి, ప్రకృతి పురుషులకంటె అతీతుడైన ఆ భగవంతునికి ఈ భరింపరాని భయంకరమైన గర్భనరకంలో ఉన్న నన్ను రక్షించి శాంతి కలిగించమని నమస్కరిస్తున్నాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=995

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: