Saturday, August 31, 2019

కపిల దేవహూతి సంవాదం - 104


(చంద్ర సూర్య పితృ మార్గంబు )

3-1018-వ.
మఱియుఁ, బరమేశ్వరదృష్టిచే హిరణ్యగర్భు నుపాసించువారు సత్యలోకంబున ద్విపరార్థావసానం బగు ప్రళయంబు దనుకఁ బరుండగు చతురాననుం బరమాత్మరూపంబున ధ్యానంబు సేయుచు నుండి పృథి వ్యాప్తేజోవాయ్వాకాశ మానసేంద్రియ శబ్దాది భూతాదుల తోడం గూడ లోకంబును బ్రకృతి యందు లీనంబుసేయ సర్వేశ్వరుండు సకల సంహర్త యగు సమయంబున గతాభిమానంబులు గలిగి బ్రహ్మలోకవాసు లగు నాత్మలు బ్రహ్మతోడం గూడి పరమానందరూపుండును సర్వోత్కృష్టుండును నగు పురాణపురుషుం బొందుదురు; కావున నీవు సర్వభూత హృదయపద్మ నివాసుండును శ్రుతానుభావుండును నిష్కళంకుడును నిరంజనుండును నిర్ద్వంద్వుండును నగు పురుషుని భావంబుచే శరణంబు నొందు" మని చెప్పి మఱియు నిట్లనియె.

భావము:
ఇంకా పరమేశ్వరుడనే దృష్టితో బ్రహ్మదేవుణ్ణి ఉపాసించేవారు సత్యలోకంలో రెండు పరార్థాల కాలం తరువాత వచ్చే ప్రళయం వరకు పరుడైన చతుర్ముఖుని పరమాత్మ రూపంలో ధ్యానిస్తూ ఉంటారు. సర్వేశ్వరుడు భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలను, మనస్సును, పంచేంద్రియాలను, పంచతన్మాత్రలను, వాటితో కూడిన సమస్త ప్రకృతినీ, సకల లోకాలనూ తనలో లీనం చేసుకుంటాడు. అప్పుడు సత్యలోకంలో నివసించే ఆత్మస్వరూపులు బ్రహ్మతో కూడ పరమానంద స్వరూపుడూ, సర్వోత్కృష్టుడూ అయిన పురాణపురుషునిలో లీనమౌతారు. కాబట్టి అమ్మా! నీవు సకల ప్రాణుల హృదయ పద్మాలలో నివసించేవాడూ, మహానుభావుడూ, నిష్కలంకుడూ, నిరంజనుడూ, అద్వితీయుడూ అయిన పురుషోత్తముణ్ణి శరణుపొందు” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=54&padyam=1018

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: