( గర్భ సంభవ ప్రకారంబు )
3-1005-వ.
దశమమాసంబున వాని నధోముఖుం గావించిన నుచ్ఛ్వాస నిశ్శ్వాసంబులు లేక ఘన దుఃఖభాజనుండు విగత జ్ఞానుండు రక్తదిగ్భాగుండు నై విష్టాస్థక్రిమియుం బోలె నేలంబడి యేడ్చుచు జ్ఞానహీనుం డై జడుడునుం బోలె నుండి; యంత నిజ భావానభిజ్ఞు లగు నితరుల వలన వృద్ధిం బొందుచు నభిమతార్థంబులం జెప్పనేరక; యనేక కీటసంకులం బయిన పర్యంకంబు నందు శయానుండై; యవయవంబులు గండూయమానంబు లైనఁ గోఁకనేరక యాసనోత్థాన గమనంబుల నశక్తుండై; తన శరీరచర్మంబు మశక మత్కుణ మక్షికాదులు పొడువ గ్రిములచే వ్యధంబడు క్రిమియుంబోలె దోదూయమానుండై రోదనంబు సేయుచు విగతజ్ఞానుండై మెలంగుచు; శైశవంబునం దత్త త్క్రియానుభవంబుఁ గావించి పౌగండ వయస్సునఁ దదనురూపంబు లగు నధ్యయనాది దుఃఖంబు లనుభవించి; తదనంతరంబ యౌవనంబు ప్రాప్తం బైన నభిమతార్థ ఫలప్రాప్తికి సాహసపూర్వకంబు లగు వృథాగ్రహంబులు సేయుచుఁ గాముకుండై; పంచమహాభూతారబ్దం బగు దేహం బందుఁ బెక్కుమాఱు లహంకార మమకారంబులం జేయుచుఁ దదర్థంబులైన కర్మంబు లాచరించుచు సంసారబద్ధు డగచు దుష్పురుష సంగమంబున శిశ్నోదరపరాయణుండై వర్తించుచు నజ్ఞానంబునం జేసి వర్దిష్యమాన రోషుం డగుచుఁ; దత్ఫలంబు లగు దుఃఖంబు లనుభవించుచుఁ గాముకుండై నిజనాశంబునకు హేతువు లగు కర్మంబులం బ్రవర్తించు చుండు; మఱియును.
భావము:
పదవ నెలలో జీవుడు తలక్రిందుగా తిరిగి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేక ఎంతో బాధపడుతూ జ్ఞానరహితుడై, నెత్తురు పులుముకున్న దేహంతో భూమిమీద పడి ఏడుస్తూ, ఎరుకలేనివాడై ఉండి, తన ఉద్దేశ్యం అర్థం చేసికోలేని ఇతరులచే పోషింపబడుతూ, తనకు కావలసిన దేదో చెప్పలేక, పెక్కు కీటకాలతో నిండిన ప్రక్కమీద పండుకొని, శరీరం దురద పుట్టినా గోకుకొనలేక, కూర్చోడానికి లేవడానికి నడవడానికి శక్తి చాలక, తన ఒంటి నిండా దోమలూ నల్లులూ ఈగలూ మొదలైనవి ప్రాకి కుడుతూ ఉంటే వారింపలేక, క్రిములచే పీడింపబడే క్రిమిలా బాధపడుతూ, ఏడుస్తూ, జ్ఞానం లేనివాడై మెలగుతూ, శైశవంలో ఆయా అవస్థలను అనుభవించి, బాల్యంలో విద్యాభ్యాసం మొదలైన వాటితో శ్రమపడి, ఆ తర్వాత యౌవనంలో తన కోర్కెలు తీర్చుకొనడం కోసం సాహసంతో కూడిన పనికిమాలిన పంతాలూ పట్టుదలలూ పూనుతూ, కామోద్రేకంతో ప్రవర్తిస్తూ, పంచభూతాత్మకమైన తన దేహంమీద మాటిమాటికీ అహంకార మమకారాలు పెంచుకుంటూ, అందుకు తగిన పనులు చేస్తూ, సంసార బంధాలలో కట్టుబడి, దుష్టుల స్నేహంవల్ల కామం పండించుకొనడం, కడుపు నిండించుకొనడంతోనే సతమతమౌతూ, అజ్ఞానియై పెచ్చు పెరిగిపోతున్న మచ్చరంతో దానికి ఫలమైన దుఃఖాన్ని అనుభవిస్తూ, కామాంధుడై, తన నాశనానికి మూలకారణమైన చెడుపనులను చేస్తూ ఉంటాడు. ఇంకా...
http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=53&padyam=1005
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :