Tuesday, November 21, 2017

పోతన రామాయణం - 40

9-334-వ.
మఱియును.
9-335-సీ.
పొలతుల వాలుచూపుల యంద చాంచల్య; 
మబలల నడుముల యంద లేమి; 
కాంతాలకములంద కౌటిల్యసంచార; 
మతివల నడపుల యంద జడిమ; 
ముగుదల పరిరంభముల యంద పీడన; 
మంగనాకుచముల యంద పోరు; 
పడతుల రతులంద బంధసద్భావంబు; 
సతులఁబాయుటలంద సంజ్వరంబు; 
9-335.1-తే.
ప్రియులు ప్రియురాండ్ర మనముల బెరసి తార్పు
లంద చౌర్యంబు; వల్లభు లాత్మ సతుల
నాఁగి క్రొమ్ముళ్ళు పట్టుటం దక్రమంబు; 
రామచంద్రుఁడు పాలించు రాజ్యమందు.


భావము:
ఇంకను, శ్రీరాముని పాలనలో ఉన్న రాజ్యం రామరాజ్యం. ఆ రామరాజ్యం అంతా ఎంత ధర్మ బద్ధంగా సాగింది అంటే; స్త్రీల వాలుచూపులలో మాత్రమే చాంచల్యం కనిపించేది; వనితల నడుములలో మాత్రమే పేదరికం ఉండేది; నెలతల తలవెంట్రుకలలో మాత్రమే కౌటిల్యం ఉండేది; తరుణుల నడకలలో మాత్రమే మాంద్యం ఉండేది; నెలతల కౌగలింతలలో మాత్రమే పీడన ఉండేది; కామినుల స్తనాల్లో మాత్రమే ఘర్షణ ఉండేది; సతులతో కలయికల్లో మాత్రమే బంధాలు ఉండేవి; కాంతల ఎడబాటులలో మాత్రమే సంతాపం ఉండేది; ఎవరి ప్రియురాండ్ర మనసు వారు తెలిసి దొంగిలించుటలో మాత్రమే దొంగతనాలు ఉండేవి; ప్రియభార్యలను భర్తలు అడ్డగించి జడలుపట్టుకొని లాగటంలో మాత్రమే అక్రమాలు ఉండేవి;



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: