Sunday, November 12, 2017

పోతన రామాయణం - 36

9-327-సీ.
పటికంపు గోడలు బవడంపు వాకిండ్లు; 
నీలంపుటరుగులు నెఱయఁ గలిగి
కమనీయ వైడూర్య స్తంభచయంబుల; 
మకరతోరణముల మహిత మగుచు
బడగల మాణిక్యబద్ధ చేలంబులఁ; 
జిగురుఁ దోరణములఁ జెలువు మీఱి
పుష్పదామకముల భూరివాసనలను; 
బహుతరధూపదీపముల మెఱసి
9-327.1-తే.
మాఱువేల్పులభంగిని మలయుచున్న
సతులుఁ బురుషులు నెప్పుడు సందడింప
గుఱుతు లిడరాని ధనముల కుప్ప లున్న
రాజసదనంబునకు వచ్చె రామవిభుఁడు.


భావము:
స్పటికాల గోడలు, పగడాల వాకిళ్ళు, ఇంద్రనీలాల వేదికలు నిండుగ ఉన్నాయి. వైడూర్యాలు పొదిగిన స్తంభాలు, మకర తోరణాలతో, ధ్వజాలతో, మాణిక్యాలు పొదిగిన వస్త్రాలతో, చిగురటాకుల తోరణాలతో, పూలదండలసువాసనలతో, ధూప దీపాలతో, దేవతలలా తిరిగుతున్న స్త్రీపురుషులతో, అనంత ధనరాసులతో మనోఙ్ఞంగా ప్రకాశిస్తున్న రాజప్రసాదానికి శ్రీరామచంద్రప్రభువు వచ్చాడు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: