Saturday, November 18, 2017

పోతన రామాయణం - 39

9-333-సీ.
కలఁగు టెల్లను మానెఁ జలధు లేడింటికి; 
జలనంబు మానె భూచక్రమునకు; 
జాగరూకత మానె జలజలోచనునకు; 
దీనభావము మానె దిక్పతులకు; 
మాసి యుండుట మానె మార్తాండవిధులకుఁ; 
గావిరి మానె దిగ్గగనములకు; 
నుడిగిపోవుట మానె నుర్వీరుహంబుల; 
కడఁగుట మానె ద్రేతాగ్నులకును;
9-333.1-ఆ.
గడిఁది వ్రేఁగు మానెఁ గరి గిరి కిటి నాగ
కమఠములకుఁ బ్రజల కలఁక మానె; 
రామచంద్రవిభుఁడు రాజేంద్రరత్నంబు
ధరణిభరణరేఖఁ దాల్చు నపుడు.

భావము:
ఆ రామరాజ్యంలో సంక్షోభాలు లేవు. సప్త సముద్రాలు కంపించడం లేదు. భూమండలం నిర్భయంగా ఉంది. పాపులు లేకపోడంతో విష్ణుమూర్తి జాగరూకత అవసరం లేకపోయింది. దిక్పాలకులకు దైనం లేదు. సూర్య చంద్రులకు వెలవెల పోవటం లేదు. దిక్కులు ఆకాశాలకు కావిరంగు పట్టటంలేదు. చెట్ల ఎడిపోవుటం లేదు. త్రేతాగ్నులు అణగిపోవుటం లేదు. భూభారం తగ్గడంతో దిగ్గజాలకు, కులపర్వతాలకు, వరాహమూర్తికి, ఆదిశేషుడికి, కూర్మమూర్తికి భారం తగ్గిపోయింది. లోకులకు కలతలు లేవు. అలా శ్రీరాముడు రాజ్యం ఏలాడు. అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=333

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: