9-311-వ.
అని విలపింప నంత విభీషణుండు రామచంద్రుని పంపుపడసి, రావణునకు దహనాది క్రియలు గావించె; నంత రాఘవేంద్రుండు నశోకవనంబున కేఁగి, శింశుపాతరు సమీపంబు నందు.
9-312-శా.
దైతేయప్రమదా పరీత నతిభీతన్ గ్రంథి బంధాలక
వ్రాతన్ నిశ్శ్వసనానిలాశ్రుకణ జీవం జీవదారామ భూ
జాతన్ శుష్కకపోల కీలిత కరాబ్జాతం బ్రభూతం గృశీ
భూతం బ్రాణసమేత సీతఁ గనియెన్ భూమీశుఁ డా ముందటన్.
భావము:
అని రావణాసురుని భార్య మండోదరి శోకిస్తోంది. అంతట విభీషణుడు శ్రీరాముని అనుజ్ఞ పొంది రావణునికి అంత్యక్రియలు చేసాడు. అప్పుడు శ్రీరాముడు అశోకవనానికి వెళ్ళి అశోకచెట్టు దగ్గరకి వెళ్ళి అక్కడ సీతాదేవిని రాక్షస స్త్రీలు చుట్టుముట్టి ఉన్నారు. ఆమె మిక్కలి భయపడుతూ ఉంది. ఆమె జుట్టు చిక్కులు పడి అట్టలు కట్టింది. నిట్టూర్పులు నిగడిస్తూ, కన్నీరు కారుస్తూ, చిక్కిపోయిన చెక్కిళ్ళపై చేయి చేర్చి, కృశించిపోయి, ప్రాణావశిష్ట అయి ఉంది. అట్టి సీతాదేవిని శ్రీరాముడు చూసాడు.
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment