Thursday, November 9, 2017

పోతన రామాయణం - 32

9-319-సీ.
కవ గూడి యిరుదెసఁ గపిరాజు రాక్షస; 
రాజు నొక్కటఁ జామరములు వీవ
హనుమంతుఁ డతిధవళాతపత్రముఁ బట్ట; 
బాదుకల్ భరతుండు భక్తిఁ దేర
శత్రుఘ్ను డమ్ములుఁ జాపంబుఁ గొనిరాఁగ; 
సౌమిత్రి భృత్యుఁడై చనువుచూప
జలపాత్రచేఁబట్టి జనకజ గూడిరాఁ; 
గాంచనఖడ్గ మంగదుఁడు మోవఁ
9-319.1-ఆ.
బసిఁడి కేడె మర్థి భల్లూకపతి మోచి
కొలువఁ బుష్పకంబు వెలయ నెక్కి 
గ్రహము లెల్లఁ గొలువఁ గడు నొప్పు సంపూర్ణ
చంద్రుపగిది రామచంద్రుఁ డొప్పె.


భావము:
జంటగా రెండు పక్కలా చేరి సుగ్రీవ విభీషణులు కూడి చామరాలు వీస్తున్నారు. హనుమంతుడు వెల్లగొడుగు పట్టుతున్నాడు. కాలిజోళ్ళు భరతుడు భక్తితో తీసుకు వస్తున్నాడు శత్రుఘ్నుడు విల్లంబులు తీసుకువస్తున్నాడు. లక్ష్మణుడు చనువుగా సేవచేస్తున్నాడు. కలశం పట్టుకుని జానకీదేవి కూడా వస్తోంది. బంగారపు కత్తిని అంగదుడు మోసుకొస్తున్నాడు. బంగారపు డాలును జాంబవంతుడు మోసుకొస్తున్నాడు. ఆ విధంగ దివ్యవైభవాలతో పుష్పకవిమానం అధిరోహించి గ్రహాలు సేవించే నిండు చంద్రుడిలా శ్రీరాముడు చక్కగా ఉన్నాడు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: