9-331-చ.
కొడుకులుఁ బెద్దకోడలును గొబ్బున మ్రొక్కిన నెత్తి చేతులం
బుడుకుచు మోములుందలలుబోరన ముద్దులుగొంచునవ్వుచుం
దొడలకు వారి రాఁదిగిచి తోఁగఁగఁ జేసిరి నేత్రధారలన్
వెడలిన ప్రాణముల్ దగఁ బ్రవిష్టములయ్యె నటంచు నుబ్బుచున్.
9-332-వ.
అంత వసిష్ఠుం డరుగుదెంచి. శ్రీరామచంద్రుని జటాబంధంబు విడిపించి, కులవృద్దులుం దానును సమంత్రకంబుగ దేవేంద్రుని మంగళస్నానంబు చేయించు బృహస్పతి చందంబున, సముద్రనదీజలంబుల నభిషేకంబు చేయించె; రఘువరుండును, సీతాసమేతుండై, జలకంబులాడి, మంచి పుట్టంబులు గట్టికొని, కమ్మని పువ్వులు దుఱిమి, సుగంధంబు లలందికొని, తొడవులు దొడిగికొని, తనకు భరతుఁడు సమర్పించిన రాజసింహాసనంబునం గూర్చుండి, యతని మన్నించి కౌసల్యకుఁ బ్రియంబు చేయుచు, జగత్పూజ్యంబుగ రాజ్యంబు జేయుచుండెను; అప్పుడు.
భావము:
కొడుకులూ, పెద్దకోడలు మ్రొక్కగా, వారిని పైకి లేవదీసి చేతులతో నిమురుతు, ముఖాలు, తలలు ముద్దులు పెడుతూ, నవ్వుతూ ఒళ్ళోకి చేరదీసి సంతోషాశ్రువలతో వారిని తడిపేసారు. పోయిన ప్రాణాలు లేచి వచ్చాయి అంటూ పొంగిపోయారు. అంతట, ఇంద్రుడికి మంగళస్నానాలు చేయించె బృహస్పతి వలె, వసిష్ఠులవారు వచ్చి కులపెద్దలు తాను శ్రీరామచంద్రునికి జటలు కట్టిన జుట్టు చిక్కు తీసి, మంత్రయుక్తంగా పవిత్రమైన సముద్రపు నీటితో, నదుల నీటితో స్నానాలు చేయించారు. శ్రీరాముడు సీతాదేవి స్నానాలు చేసి, చక్కటి బట్టలను ధరించి, సువాసనలుగల పూలు ముడిచికొని, సుగంధాలను రాసుకొని, ఆభరణాలు అలంకరించుకొని, తనకు భరతుడు అప్పగించిన పట్టపు సింహాసనపై కూర్చున్నారు. భరతుని ఆదరిస్తూ కౌసల్యాదేవి సంతోషించేలా, లోకం పూజించేలా రాజ్యం ఏలుతూ ఉన్నాడు. ఆ సమయంలో....
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment