Wednesday, November 8, 2017

పోతన రామాయణం - 30

9-315-వ. 
ఇట్లు విభీషణసంస్థాపనుండయి రామచంద్రుఁడు సీతాలక్ష్మణ సమేతుండయి సుగ్రీవ హనుమదాదులం గూడికొని, పుష్పకారూఢుం డయి, వేల్పులు గురియు పువ్వులసోనలం దడియుచుఁ దొల్లి వచ్చిన తెరువుజాడలు సీతకు నెఱిఁగించుచు, మరలి నందిగ్రామంబునకు వచ్చెను; అయ్యవసరంబున.
9-316-ఆ.
రామచంద్రవిభుని రాక వీనుల విని
భరతుఁ డుత్సహించి పాదుకలను
మోచికొనుచు వచ్చి ముదముతోఁ బురజను
లెల్ల గొలువ నన్న కెదురువచ్చె.


భావము:
ఈ విధంగా శ్రీరాముడు విభీషణుని లంకా రాజ్యంలో ప్రతిష్ఠించాడు. పిమ్మట, శ్రీరాముడు సీతాలక్ష్మణ, సుగ్రీవ, హనుమంతాదుల సమేతంగా పుష్పకవిమానం ఎక్కాడు. దేవతలు పూల జల్లులు కురిపిస్తున్నారు. ఇంతకుముందు వచ్చిన దారి, గుర్తులు సీతకి చూపుతూ తిరిగి నందిగ్రామానికి వచ్చాడు. ఆ సమయానికి... శ్రీరామచంద్రప్రభువు రాక తెలిసిన భరతుడు ఉత్సాహంగా రామపాదుకలను మోసుకొంటూ అక్కడకు నందిగ్రామం చేరాడు. అయధ్య ప్రజలు అందరు సేవిస్తూ వెంట వచ్చారు. అన్న శ్రీరాముడు చేరగానే సంతోషముగా ఎదురువెళ్ళాడు.:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments: