9-342-సీ.
"భగవంతుఁడగు రామభద్రుండు ప్రీతితో;
దేవోత్తముని సర్వదేవమయునిఁ
దనుఁదాన కూర్చి యధ్వరములు చేసెను;
హోతకుఁ దూరుపు నుత్తరంబు
సామగాయకునికి శమనదిగ్భాగంబు;
బ్రహ్మకుఁ గ్రమమునఁ బడమ రెల్ల
నధ్వర్యునకు శేష మాచార్యునకు నిచ్చి;
సొమ్ములఁ బంచి భూసురుల కొసఁగి
9-342.1-తే.
తనదు రెండు పుట్టంబులు దనకు నయిన
మెలఁత మంగళసూత్రంబు మినుకుఁ దక్క
వినతుఁడై యుండె; నా రాము వితరణంబు
పాండవోత్తమ! యేమని పలుకవచ్చు?
భావము:
“ఓ పాండవోత్తమా! పరీక్షిత్తూ! సాక్షాత్తు భగవంతుడే ఐన శ్రీరాముడు వినయవంతుడు ప్రీతితో తానే అయిన విష్ణుమూర్తి గురించి అనేక యాగాలు చేసాడు. హోతకు తూర్పుదిక్కు, సామగానం చేసిన వానికి ఉత్తరపు దిక్కు, ఋత్వికునికి దక్షిణపు దిక్కు, అధ్వర్యనికి పడమర దిక్కు, మిగిలినది గురువునకు ఇచ్చివేసాడు. తనకు రెండు వస్త్రాలు, తన భార్యకు మంగళసూత్రంబిళ్ళ ఉంచుకుని మిగిలిన సంపదలను విప్రులకు పంచిపెట్టాడు. ఆ శ్రీరాముని దానశీలత ఎంతని పొగడగలము.
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment